సికింద్రాబాద్‌ నుంచి నాలుగు కొత్త రైళ్లు ప్రారంభం

హైదరాబాద్‌, జూలై :వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వేలో చేర్చేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి మునియప్పను కోరారు. బుధవారంనాడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొత్తగా నాలుగు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పచ్చజెండా ఊపి ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌ కుమార్‌రెడ్డి, కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి కూడా పాల్గొన్నారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య దురంతో ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-దర్బంగ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-బెల్లంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌-అజ్మీర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం నాలుగు కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించడం హర్షదాయకమన్నారు. ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలందిస్తున్న వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్యరైల్వేలో విలీనం చేయాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్పకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అనంతరం కేంద్ర రైల్వే సహాయ మంత్రి మునియప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను అందజేస్తే పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను రానున్న అయిదేళ్లల్లో పూర్తి చేస్తామని చెప్పారు.