సిటీబస్సులపై అలుముకున్న నీలినీడలు
ఖమ్మం, జూలై 23: ఖమ్మం జిల్లా కేంద్రంలో సిటీ బస్సులపై నీలినీడలు అలుముకుంటున్నాయి. అటు కనీస చార్జి 8 రూపాయలు. ట్రాఫిక్ సమస్య, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఖమ్మంలో సిటీ బస్సుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. రెండు సంవత్సరాలుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. రవాణాశాఖాధికారులు ఖమ్మం పట్టణంలో పాటు సమీప గ్రామాల మార్గాలు సర్వే చేశారు. గత సమస్యలను దృష్టిలో పెట్టుకొని బస్సు యజమానులకు నష్టం లేకుండా 20 సెంట్ల మినీ బస్సులను ఏర్పాటు చేయాలని రవాణా శాఖాధికారులు హడావుడిగా చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశాల మేరకు హడావుడి చేసిన రవాణా శాఖాధికారులు తర్వాత మరిచిపోయారు. పందిళ్లపల్లి మీదుగా చింతకాని వరకు, రఘునాథపాలెం, వి.వెంకటాయపాలెం, కామంచిపల్లి, కాశిరాజుగూడెం, కళ్లంపాడు, వెంకటగిరి వరకు సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు రవాణా శాఖాధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రారంభంలో హడావుడి చేసిన అధికారులు పిమ్మట సిటీ బస్సులను మరిచిపోయారు. ఖమ్మం పట్టణంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆటోల కనీస చార్జీలు 8 రూపాయలు కాగా ఇతర ప్రాంతాలకైతే 30 నుంచి 40 రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ చార్జీలను భరించలేక సామాన్యమానువులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో ఖమ్మం పట్టణం నగర పాలక సంస్థగా మారుతుండడం వల్ల పట్టణ శివారు ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్న కారణంగా సిటీ బస్సుల ఆవశ్యకతను అధికారులు ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంది.