సిరిసిల్లలో విజయమ్మను అడ్డుకోవాలి..

వైఎస్‌ హయాంలోనే నేతన్నల ఆత్మహత్యలు అధికం
అప్పుడు వైఎస్‌ ఏం చేశారో ఆయన భార్యగా వివరణ ఇవ్వాలి
పర్యటించాలంటే తెలంగాణపై తమ వైఖరిని చెప్పాల్సిందే..
లేకుంటే సిరిసిల్ల మరో మహబూబాబాద్‌ అవుతుంది..
నాడు జగన్‌కు చెప్పిన గుణపాఠమే విజయమ్మకూ చెబుతాం..
రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీ దీక్ష నాటకం
తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం
ఖమ్మం, జూలై 16 (జనంసాక్షి) : విజయమ్మ సిరిసిల్ల పర్యటనను అడ్డుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలుపకుండా తెలంగాణలోని సిరిసిల్లలో పర్యటించడం విజయమ్మకు తగదన్నారు. శనివారం ఖమ్మంలో పర్యటించిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షను అణదొక్కే కుట్రలో భాగంగానే విజయమ్మ ఈ దీక్ష నాటకానికి ప్రణాళికలు రచించిందన్నారు. ఈ కుట్ర వెనుక మిగతా సీమాంధ్ర పార్టీల నాయకుల మద్దతుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రణబ్‌కు ఓటు వేయడం వెనుక ‘ఓట్‌ ఫర్‌ బెయిల్‌’ డీల్‌ కుదిరిందని, ఇప్పుడు జగన్‌కు బెయిల్‌ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని కోదండరాం విమర్శించారు. అసలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే అత్యధిక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. నాడు వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వైఎస్‌ కనీసం ఓదార్చేందుకు కూడా రాలేదన్నారు. ఒకవేళ వైఎస్‌ నేత కార్మికుల కోసం ఏదైనా మంచి చేశాడని అనుకుంటే, అదేంటో విజయమ్మ వివరణ ఇవ్వాలన్నారు. విజయమ్మ తెలంగాణలో అంతగా పర్యటించాలనుకుంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన వైఖరి తెలుపాల్సిందేనని కోదండరాం డిమాండ్‌ చేశారు. లేకుంటే సిరిసిల్ల మరో మహబూబాబాద్‌ అవుతుందని హెచ్చరించారు. నాడు మహబూబాబాద్‌లో జగన్‌కు గుణపాఠం చెప్పిన తెలంగాణ ప్రజలు, సిరిసిల్లలో బలవంతంగా పర్యటించడానికి ప్రయత్నిస్తే విజయ్మకు కూడా గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజకీయంగా బలపడి లబ్ధి పొందేందుకే వైఎస్సార్సీపీ విజయమ్మ దీక్ష నాటకాన్ని ఆడుతున్నదని కోదండరాం ఆరోపించారు. సమైక్యవాద పార్టీలకు తెలంగాణలో చోటు లేదని, ఇక్కడ నిలదొక్కుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపాల్సి ఉంటుందని విజయమ్మ తెలుసుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు టీడీపీకి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినందుకు, రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేయాలని కుట్ర చేసినందుకు ఆ పార్టీని తెలంగాణలో నామరూపాల్లేకుండా చేస్తున్నారన్న విషయాన్ని విజయమ్మ తెలుసుకోవాలన్నారు. 30 ఏళ్ల రాజకీయ పార్టీనే తెలంగాణకు వ్యతిరేకమని ఆదరించిన ఇక్కడి ప్రజానీకం, మూడేళ్లు కూడా లేని వైఎస్సార్సీపీని తన్ని తరిమేస్తారన్నారు. వైఎస్సార్సీపీలో ఉన్న తెలంగాన నాయకులు ఆ పార్టీలో ఉంటే కనీసం ప్రతిపక్షంలో కూడా కూర్చోలేరని తెలుసుకోవాలన్నారు. తాము నిజమైన తెలంగాణవాదులమని భావిస్తే, పార్టీని వెంటనే వీడి, బయటకు వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యక్షంగా ఉద్యమించాలని హితవు పలికారు. అప్పుడే తెలంగాణ ప్రజలు గుర్తిస్తారని తెలుసుకోవాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైఎస్‌ జగన్‌ పార్లమెంటులో ప్లకార్డులు పట్టి నాడు డిసెంబర్‌ 9 ప్రకటన వెనక్కు పోవడానికి కారణమయ్యాడని గుర్తు చేసుకోవాలన్నారు. 23న ఒకవేళ సిరిసిల్లలో పర్యటించడానికి సిద్ధపడితే తెలంగాణవాదులంతా ఏకమై ఆమెను అడ్డుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు.