హక్కానీ గ్రూపు ఉగ్రవాద సంస్థ

న్యూయార్క్‌: పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దిశగా అమెరికా కదులుతోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్‌ త్వరలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ముందు ఉంచనున్నారు. ఈ మేరకు ఆమె తాజాగా వెల్లడించారు. ఈ నెల 9లోగా కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తే సౌదీ అరేబియా, యూఏఈ, ఇతర దేశాల్లో దాని నిధుల సేకరణ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడానికి మార్గం సుగమమవుతుందని ఇటీవల ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కోంది. సైనిక చర్యకు దిగాలంటూ పాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు, వీలవుతుందని తెలిపింది. మరోవైపు ఈ అంశంపై దేశాధ్యక్షుడు ఒబామా గుర్తిస్తే అమెరికా, పాక్‌ మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశముందని కార్యవర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో హిల్లరీ ఇవ్వనున్న నివేదిక కీలకం కానుంది.