హుజూరాబాద్‌లో ఈటెల పట్టు సాధించేనా?
టిఆర్‌ఎస్ మరోమారు సిట్టింగ్ సీటును కాపాడుకునేనా
సోషల్ విూడియాలో హల్‌చల్‌గా మారిన ఓటుకు నోటు పంపకాలు
హుజూరాబాద్,అక్టోబర్28జనం సాక్షి: ఆరు పర్యాయాలు గెలిచిన తనకు తిరుగులేదని నిరూపించిన ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌లో మరోసారి తనకు ఎదురులేదని నిరూపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అక్టోబరు 1న ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా.. అంతకు నాలుగు నెలల ముందు నుంచే ప్రచారం ప్రారంభమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూన్ 12న తన శాసనసభ్యత్వానికి, టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి, 14న బీజేపీలో చేరిన నాటినుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందన్నది పట్టించుకోకుండా.. నియోజకవర్గ ప్రజలను కలుస్తూ.. తనకు అండగా నిలువాలని కోరుతూ వచ్చారు. ఈటల వెంట వెళ్లిన పార్టీ నాయకులను, శ్రేణులను తిరిగి పార్టీలోకి
రప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అభ్యర్థి వేటలో పడి ఆలస్యంగా ఎన్నికల రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ చివరకు ఎన్‌ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించుకునే అవకాశం లేకపోవడంతో కేసీఆర్, అమిత్‌షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలెవరూ ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఈటెల గెలుపు కోసం తరుణ్‌చుగ్, కిషన్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి, మాజీ మంత్రి బాబుమోహన్, మాజీ శాసన సభ్యురాలు బోడిగే శోభ,వివేక్ వెంకట్ స్వామి తదితరులు జోరుగా ప్రచారం చేశారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు బహిరంగంగా మద్దతు పలికారు. ఇక రెండు పార్టీలకు దీటుగా కాంగ్రెస్ కూడా తన ప్రచారాన్ని కొనసాగించింది. పార్టీ అభ్యర్థిగా వెంకటన్‌ను బరిలోకి దింపడం ఇతర పార్టీలతో పోల్చుకుంటే కొంత ఆలస్యమైనా ప్రధాన రాజకీయ పార్టీలకు తగ్గకుండా తన ప్రచారంలో జోరును కొనసాగించింది. ఆ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ములుగు నియోజకవర్గం శాసనసభ్యులు సీతక్కతో పాటు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర నేతులు, మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు ప్రచారం చేశారు. పైగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ఎన్నిక కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత ఆసక్తి నెలకొంది. ఇలా మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని ముగించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పక్రియలో ప్రచార పర్వం బుధవారంతో ముగియ డంతో అప్పుడే ప్రలోభాల పర్వం తెరపైకి వచ్చింది. పోలింగ్‌కు ముందు మిగిలి ఉన్న ఈ రెండు రోజులే కీలకం కానున్నాయి. దీంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను మొదలు పెట్టేశాయి. పెద్ద మొత్తంగా నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాల్లో ఉన్నారంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. డబ్బుల పంపిణీ వ్యవహారం ఇప్పుడు సోషల్ విూడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. నగదు పంపిణీ జరగడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ విషయంలో గొడవకు దిగినట్లు, తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసన తెలిపినట్లు సమాచారం. కనీసం ఓటుకు 6నుంచి పదివేల వరకు పంచుతుతున్నారని సమాచారం. ఈ రేటును మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రజల్లోకి వెళ్లడంతో ఎవరికి వారు ఆరా తీస్తున్నారు. ఇసి కూడా రంగంలోకి దిగి ఓ కన్నేసింది. నగదు పంపిణీ ప్రారంభమైనట్లు టీవీ చానళ్లలో, సోషల్ విూడియాలో వీడియోలు, క్లిప్పింగ్‌లు వైరల్ కావడంతో భద్రతా దళాలను రంగంలోకి దిగాయి. హోరాహోరీగా సాగిన ప్రచారంలో హుజూరాబాద్ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ హోరాహోరీ పోరులో ఫలితం తమదేనన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నర్సింగరావు కూడా రేసులో తానే ముందున్నానంటున్నారు.