హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్ దలితబంధు సభ
విపక్షనేతల ముందస్తు అరెస్ట్
కరీంనగర్,ఆగస్ట్16(జనంసాక్షి): హుజూరాబాద్‌లో సీఎం కెసిఆర్ దలితబంధు సభ నేపథ్యంలో ప్రతిపక్ష
నేతలను ముందస్తు అరెస్టులు చేసారు. హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నేతలు, స్టూడెంట్లను అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభకు ఆటంకాలు కలిగిస్తారన్న అనుమానంతో హుజురాబాద్ లోని బీజేపీ, కాంగ్రెస్ సర్పంచులు, ఎంపీటీసీలను అరెస్ట్ చేశారు. హుజురాబాద్ మండలం రంగాపూర్ సర్పంచ్ కరుణాకర్ ను అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. చెల్పూరులో వార్డ్ మెంబర్ సారయ్యతో పాటు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏబీవీపీ, ఔªూఙఎ నేతలను అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్, జాక్ నేతలు రాకేశ్, పన్నల మహేష్, వినోద్ లోక్ నాయక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ లో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు మర్రి సతీష్ ను అరెస్ట్ చేసి వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు. ముందస్తు అరెస్ట్ లపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడ్డారు.