అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం

` త్వరలో పథకాన్ని ప్రారంభిస్తాం: మంత్రి సీతక్క
హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహారం పథకం ప్రారంభించనున్నట్లు తెలంగాణ మహిళ, శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్‌లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశామని.. దీంతో 30 శాతం హాజరు పెరిగిందని చెప్పారు. ప్రతి చిన్నారికీ ఉదయం 100మి.లీ పాలు సరఫరా చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. అంగన్వాడీల్లోని వసతులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. చిన్నారులకు వారంలో కనీసం ఒక రోజు ఎగ్‌ బిర్యానీ, వెజిటబుల్‌ బిర్యానీ వడ్డించాలన్నారు.‘‘అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి. ఇందిరమ్మ ఇళ్ల తరహాలో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి అంగన్వాడీ భవనాలకు అనుమతులు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 625 ప్రాంతాల్లోనే స్థలాలు గుర్తించారు. ఒక్కో అంగన్వాడీ భవన నిర్మాణానికి రూ.12లక్షలు మంజూరు చేశాం. నిర్మాణాలు పూర్తయిన 22 భవనాలను స్థానిక ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవం చేయించాలి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫాం చీరల పంపిణీ ప్రారంభించాలి’’అని మంత్రి సీతక్క ఆదేశించారు.