అంగన్‌వాడీల ఆధ్వర్యంలో హరితహారం

కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అంగన్‌వాడీల ఆధ్వర్యంలో జిల్లాలో 15 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఐసీడీఎస్‌ జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. నాలుగో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు వేగవంతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అన్నారు. అవసరమైతే ఇంకా మరిన్ని మొక్కలు నాటేందుకు ముందుకొస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టు కార్యాలయాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో, శిశు విహార్‌లో, చైల్డ్‌ ¬మ్స్‌లో నాటడానికి స్థలాలను గుర్తించామని అన్నారు. ప్రస్తుతానికి చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రహరీ గోడలు లేనందున మొక్కలు నాటడానికి వీలు పడటం లేదన్నారు. సొంతగా స్థలం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలన్నింటిలో మొక్కలు నాటడానికి తమవంతు ప్రయత్నం చేస్తామన్నారు. నాటిన ప్రతీ మొక్కను బ్రతికించే బాధ్యత నాటిన వారిదేనని, ప్రతీ రోజు వాటిని నీళ్లు పోసి బ్రతికించాలని తెలిపారు. మూడో విడత హరితహరం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లోని రైతులకు టేకు మొక్కలు పంపిణీ చేసి, వాటిని పొలాల గట్లపై నాటే విధంగా ఉపాధి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పంపిణీ చేసిన మొక్కల సంరక్షణ బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. ఈజీఎస్‌ ఆధ్వర్యంలో మొక్కలను పంపిణీ చేస్తామని, ఎవరైనా రైతులు పండ్ల తోటల సాగు చేపడితే అవసరమైన మొక్కలను అందిస్తామన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకుపోవాలనే అంశాలను అధికారులు సూచించారు.