అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన మంత్రి

అనంతపురం,జూలై7(జ‌నం సాక్షి): అనంతపురం నగరం, కృపానంద నగర్‌లోని అంగన్‌ వాడీ కేంద్రాన్ని మంత్రి పరిటాల సునీత శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌ వాడీ కేంద్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, గర్భిణీ, బాలింతలు ఎంత మందికి పౌష్టికాహారం అందజేస్తున్నారు వంటి విషయాలు అడిగి, రిజిస్టర్‌ను పరిశీలించారు. అంగన్‌ వాడీ సెంటర్‌లో ఉన్న గర్భిణీ, బాలింతలను అడిగి పౌష్టికాహారం అందుతున్న తీరును తెలుసుకున్నారు. అంగన్‌వాడీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనంపై ఆరాతీశారు. తమను ఎవరూ డబ్బులు అడగలేదని అంగన్వాడీలు మంత్రికి తెలిపారు. డబ్బులు వసూలు చేసే వారిని సహించేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అంగన్‌ వాడీ కేంద్రంలోని సౌకర్యాలను పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా తరగతి గదులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. పిల్లలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్‌ వాడీ కేంద్రంలోని గర్భిణీ, బాలింతలకు గుడ్లు, పాలు అందచేశారు.