అంటువ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలి

గుంటూరు,జూలై7(జ‌నం సాక్షి): జిల్లా వ్యాపితంగా కురుస్తున్న వర్షాలతో విషజ్వరాలు, డెంగ్యు ప్రబలుతున్నాయని తక్షణమే వైద్య ఆరోగ్యశాఖ స్పందించి క్యాంపులు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఆయా ప్రాంతాలలో మెడికల్‌ క్యాంప్‌లను నిర్వహించాలని అన్నారు.జిల్లాలో పేదలు నివాసం ఉండే ప్రాంతాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, మంచినీటిని క్లోరినేషన్‌ చేయాలని అన్నారు. మురుగునీటి ప్రాంతాల్లో కాలువలు శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ తగిన మందులు సమకూర్చుకొని విషజ్వరాల నివారణకు పూనుకొవాలన్నారు.ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రధాన పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యానికి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉంచాలన్నారు.