అందరినీ ఆదుకుంటాం

స్వస్థలాలకు చేరుస్తాం
ఉత్తరాఖండ్‌ బాధితులకు సీఎం భరోసా
న్యూఢల్లీి, జూన్‌ 25 (జనంసాక్షి) :
ఉత్తరాఖండ్‌లోని వరద ప్రాంతాల్లో చిక్కుకున్న అందరినీ ఆదుకుంటాం.. స్వస్థలాలకు చేరుస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అందర్నీ చేరవేసేంతవరకు సహాయకం కొనసాగుతుంది.. ఆఖరి యాత్రికుడ్ని చేరవేసేంతవరకూ తోడ్పడతామని అన్నారు. మంగళవారం ఉదయం ఢల్లీికి చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీ భవన్‌ను సందర్శించారు. అక్కడి బాధితులను పరామర్శించారు. ఏర్పాట్లు, వసతులపై ఆరా తీశారు. వారి అనుభవాలు, వారి బాధలలో పాలుపంచుకున్నారు. అనంతరం కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. తమకు అందిన సమాచారం మేరకు రాష్ట్రం నుంచి 2500 మంది పైచిలుకు చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వారిలో నేటివరకు 1600 మంది వరకు తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారని రికార్డులు చెబుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికంటే ముందుగానే స్పందించిందన్నారు.  ఐఏఎస్‌ అధికారిని పంపించామన్నారు. హైదరాబాద్‌లోను, న్యూఢల్లీిలోను, ఉత్తరాఖండ్‌లోను సహాయక కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం విజయబహుగుణతో కూడా పలుమార్లు తాను ఫోన్లో మాట్లాడనని, అక్కడి పరిస్థితులు తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. అంతేగాక రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌, కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారన్నారు.  సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇంకా మిగిలిన వారిని చేరవేసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఉత్తరాఖండ్‌ నుంచే నేరుగా హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్కడి బాధితులు ఎలా కోరుకుంటే అలా వారి వారి స్వస్థలాలకు తరలించేందుకు కృషి చేస్తూనే ఉన్నామన్నారు. ఆపదల్లో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం.. జాతీయ విపత్తులు.. ఉపద్రవాల సమయంలో రాజకీయాలకు అతీతంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  కొందరు రాజకీయాలకు పాల్పడడం విచారకరమన్నారు. అంతకుమించి తానేమీ మాట్లాడబోనని అన్నారు.