కొండా సురేఖపై  కేటీఆర్‌ దావా

` నాగార్జున కేసులో సురేఖకు కోర్టు నోటీసులు
హైదరాబాద్‌(జనంసాక్షి):మంత్రి కొండా సురేఖపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఆయన తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు దీనికి సంబంధించిన పిటిషన్‌ దాఖలు చేశారు. భారాస నేతలు బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. ఇటీవల కొండా సురేఖ విూడియాతో మాట్లాడుతూ సినీరంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. కొండా సురేఖపై ఇప్పటికే ప్రముఖ సినీనటుడు నాగార్జున క్రిమినల్‌ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆమె తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ఇదిలావుంటే నాగార్జున పిటిషన్‌ ఆధారంగా మంత్రి కొండా సురేఖకు నాంపల్లికోర్టు నోటీసులు జారీ చేసింది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొండా సురేఖపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును కోరారు నాగార్జున. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్‌ మెజిస్టేట్ర్‌ కోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 23కు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.

తాజావార్తలు