అందరినీ ప్రేమించాలి 

– నాన్న నాకు అదే చెప్పారు
– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌
– రాజీవ్‌ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన రాహుల్‌, ప్రియాంక
న్యూఢిల్లీ, మే19(జ‌నం సాక్షి) : భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ 27వ వర్థంతి సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ శ్రేణులు దేశవ్యాప్తంగా నివాళులర్పించాయి. కాగా రాజీవ్‌గాంధీ కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీలు ఢిల్లీలోని రాజీవ్‌ గాంధీ స్మారకస్థూపం వద్ద నివాళులు అర్పించారు. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ రాహుల్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ద్వేషాన్ని నమ్ముకున్న వారు చెరసాలలో ఉన్నట్లేనని మా నాన్న నాకు చెప్పారు. సోమవారం ఆయన వర్థంతి. ఈ సందర్భంగా.. అందరినీ ప్రేమించాలి అని నాన్న నాకు నేర్పినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఓ కుమారుడికి తండ్రి ఇచ్చే విలువైన కానుక ఇది. తనను ప్రేమించేవారి హృదయాల్లో రాజీవ్‌ గాంధీ ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతారు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. రాజీవ్‌ కుటుంబీకులతో పాటు, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. అదేవిధంగా తెలంగాణలో టీపీసీసీ ఆధ్వర్యంలో రాజీవ్‌ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీభవన్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్‌ నేతలు నివాళులర్పించారు. 1991, మే 21న తమిళనాడులోని పెరంబూరులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్‌గాంధీని ఎల్‌టీటీఈ హత్య చేసింది. తన తండ్రిని హత్య చేసిన వారి గురించి గతంలో రాహుల్‌ మాట్లాడుతూ.. తాను, తన సోదరి ప్రియాంక హంతకులను క్షమించేశామని, వారిపై ఎలాంటి కోపం లేదని పేర్కొన్నారు. మరోవైపు రాజీవ్‌గాంధీ వర్థంతి నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ అధినేత కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేశారు.
———————————————–