అందర్నీ సంతృప్తిపరిచా..సురేష్‌ప్రభు

4

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఇక  దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబ్జడెట్‌ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రైలు కోసమేనన్న సూత్రం ఆధారంగా రైల్వేబ్జడెట్‌ను తయారు చేసినట్లు తెలిపారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రయాణికుడికి మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నం చేశామన్నారు. రైతుల సౌకర్యం కోసమూ కొన్ని చర్యలు తీసుకున్నామని, వృద్ధులు, వికలాంగుల కోసం స్టేషన్లలో లిప్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా వికలాంగులు, అంధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రతిపాదించినట్లు వివరించారు. భారతీయ రైల్వేల్లో సౌరశక్తిని పెద్దఎత్తున వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సురేశ్‌ ప్రభు తెలిపారు. జమ్మూకశ్మర్‌లోని కత్రాలో ఇప్పటికే సౌరశక్తి విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఆహ్వానించినట్టు తెలిపారు. 1000 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యమున్న సౌరశక్తి కేంద్రాలను కూడా నెలకొల్పనున్నట్టు ఆయన వెల్లడించారు.