అంధులకు ప్రభుత్వం చేయూత
నిజామాబాద్, జనవరి 4 (): అంధులకు లూయీ బ్రెయిలీ ఆదర్శనీయుడని నిజామాబాద్ అదనపుజెసి శ్రీరాంరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్ భవన్‌లో బ్రెయిలీ 204వ జన్మదిన వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫ్రాన్స్ దేశస్థుడు బ్రెయిలీ తన చిన్నతనంలోనే తండ్రితో కలిసి కూలిపని చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు కళ్ళు పొగొట్టుకున్నాడని కళ్ళు లేవన్న బాధ పెట్టుకోకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ చదువును కొనసాగిస్తూ అంధులకు బ్రెయిన్ లిపిని తయారుచేశాడని గుర్తు చేశారు. జిల్లాలోని అంధులకు ప్రభుత్వ పరంగా సహాయసహకారాలు అందిస్తామని ఆయన తెలిపారు. పాఠశాల స్థాయి నుంచి అంధులకు, వికలాంగులకు, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంగాన్‌వాడీ కేంద్రాల ద్వారా అమృత హస్తం పథకాన్ని ప్రారంభించి పౌష్టికాహారాన్ని అందించడం జరగుతుందన్నారు. వికలాంగులకు ఫించన్‌లతోపాటు వారికి అవసరమయ్యే సామాగ్రిని పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఈడీ సుభాష్‌చంద్రబోస్, డీఈఓ శ్రీనివాస్‌చారి, ఇందిరా క్రాంతిపథకం పిడి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.