అంబానీకే భద్రతా..

సామాన్యుల సంగతేంటి?
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం
న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) :
దేశంలో సామాన్యులకు భద్రత కరువవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యులకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ప్రముఖులకు జెడ్‌ కేటగిరి భద్రత కల్పించడంపై ఆక్షేపణ వ్యక్తం చేసింది. రిలయన్స్‌ సంస్థ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీకి జెడ్‌ కేటగిరి భద్రత కల్పించాల్సిన అవసరం ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంబానీలాంటి వ్యక్తులకు భారీ భద్రత కల్పిస్తుంటే సామాన్యుల గతేంటని ప్రశ్నించింది. దేశ రాజధాని ఢిల్లీలో సరైన భద్రతా ఏర్పాట్లు కల్పించి ఉంటే ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరిగి ఉండేది కాదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బొగ్గు కుంభకోణం విచారణ సందర్భంగా సీబీఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మరునాడే సుప్రీంకోర్టు సామాన్యుల భద్రతపై కేంద్రాన్ని నిలదీయడం గమనార్హం. బొగ్గు కుంభకోణంపై దర్యాప్తు వివరాలను తనకు ముందుగా తెలియజేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేస్తూ విశ్వాస ఘాతుక చర్య అని సీబీఐని తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతోంది. ఆమె పూర్తిగా కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యుల భద్రతను గాలికొదిలేసి వీఐపీల సేవలో తరిస్తుందనే రీతిలో సుప్రీం వ్యాఖ్యానించడంతో సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మరోసారి వెలుగు చూసింది.