అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన
భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు.
వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో వారు మరింత భయంలో ఉన్నారు. ఇటీవల  కురిసిన అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉభయ జిల్లాల్లో బుధవారం రాత్రి, గురువారం సాయంత్రం గాలిదుమారం వణికించేలా చేసింది. గాలికి తోడు వర్షం కురిసింది. గాలి బీభత్సానికి ఇళ్ల పైకప్పులు దెబ్బతిన్నాయి. మామిడి తోటల్లో కాయలన్నీ నేలరాలగా, బొప్పాయి తోటలు కుప్పకూలాయి. పంటంతా నేలపాలైంది. పలు గ్రామాల్లో భారీ వృక్షాలకు తోడు విద్యుత్తు స్తంభాలు నేలకూలి సరఫరాకు అంతరాయం కలిగింది. తీగలు తాకడంలో పలు గ్రామాల్లో పాడిగేదెలు, ఆవులు, దుక్కిటెడ్లు మృత్యువాతపడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిచిపోయింది.  మరోపక్క కొనుగోలు కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం ఎగుమతిలో జాప్యం జరుగుతుండటంతో రైతులు వర్షానికి వాటిని కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. భారీవర్షం కురిస్తే బస్తాల్లో నిల్వచేసిన ధాన్యం ఏ క్షణాన ముద్దవుతుందేమోనని రైతులు, కొనుగోలు నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు.  రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు తరలించి తేమకోసం ఆరబోసుకొని విక్రయానికి సిద్ధమవుతున్నా పరిస్తితులు అనుకూలించడం లేదు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని తరలిం చేందుకు లారీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వ చేసుకొన్న రైతులు చిన్నపాటి చినుకుపడినా అవస్థలు పడాల్సి వస్తుంది. వడగండ్లతో వానతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కొద్దిపాటి జల్లు కురిసింది. దీంతో కొంత మంది రైతులు తేమ శాతం కోసం ఆరబోసుకున్న వారు ఆందోళనకు గురయ్యారు.  ధాన్యం బస్తాలు తడవకుండా ప్రభుత్వం సరఫరా చేసిన, తమవద్ద ఉన్న టార్పాలిన్లను కప్పుకొని అప్రమత్తమయ్యారు. ధాన్యాన్ని ఆరబోసుకొన్న రైతులు, బస్తాల్లో నిల్వచేసుకొన్న రైతులు వర్షానికి తడవకుండా రక్షణ చర్యలు తీసుకొన్నారు. ప్రస్తుతం గన్నీ బస్తాల కొరత కూడా లేదు.