*అకాల వర్షానికి కుప్పకూలిన ఇండ్లు*
*నిలువ నీడ కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులు* *పట్టించుకోని ప్రభుత్వ అధికారులు* అలంపూర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 14 :- గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అలంపూర్ మండల పరిధిలోని బుక్కాపురం గ్రామం హరిజనవాడలో లావణ్య ఇల్లు నేలమట్టమయినప్పటికీ కాంతమ్మ ఇల్లు వరండా కూలిపోయింది రెండు రోజులు అయినప్పటి,నేటి వరకు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఇండ్లు కూలిపోయిన అభాగ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకులు కాలాక చేతులు పట్టుకున్న చెందాన ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ఈ విధానాన్ని విడనాడి అభాగ్యులకు ఆసరా కల్పించాలని ప్రజానాయకులు అన్నారు. బుధవారం ప్రజానాయకులు బుక్కాపురం గ్రామంలో పాడుబడ్డ ఇంట్లోను పరిశీలించి ఇండ్లు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుక్కాపురం గ్రామంలో గత 20 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని ఆ ఇండ్లలో నివాసం చేస్తున్నారని అయితే ప్రస్తుతం ఆ కాలనీలో ఉండే ఇండ్లు ఇప్పుడు అన్ని శిధిలావస్థకు చేరుకున్నాయని తక్షణమే ప్రభుత్వం స్పందించి కాలనీవాసులందరికీ వేరే ఎక్కడైనా నివాస కేంద్రాలు ఏర్పాటు చేయాలనిఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత సంవత్సరం భారీ వర్షాల కారణంగా ఐజ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు పడి ఐదుగురు సజీవ సమాధి అయ్యారని, అటువంటి సంఘటన పునరావృతం కాకుండానే బుక్కాపురం గ్రామంలోనిఇండ్లు కోల్పోయిన, పాడుబడ్డ ఇండ్లను గుర్తించి వారికి వేరే స్థిరనివాసం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లావణ్య కాంతమ్మ వాళ్ళ ఇండ్లు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు అదృష్టవశాత్తు పట్టపగలు పడిపోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారని, ఒకవేళ రాత్రివేళ నిద్రించిన సమయంలో ఇండ్లు కూలిపోయి ఉంటే మరో కొత్తపల్లెగా భయానక స్థితిలో నిలిచేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా అదిగో డబుల్ బెడ్ రూమ్ ఇదిగో డబుల్ బెడ్ రూమ్ అని గాలి మేడలు చూపిస్తున్నారు తప్ప నివాసలు కోల్పోయిన అభాగ్యులకు స్థిరనివాసాలు ఏర్పాటు చేయడం లేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం వచ్చేటప్పుడు మీకు అది చేస్తాం,ఇది చేస్తాం అంటున్నారే గాని నేడు ఇండ్లు కోల్పోయిన కుటుంబాల వైపు కన్నెత్తి చూడడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఆ గ్రామాన్ని సందర్శించి తక్షణ సహాయ నిమిత్తం వారికి ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసి ఇండ్లు కోల్పోయిన అభాగ్యులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు తహసిల్దార్ కి , మండల అభివృద్ధి అధికారికి నివాసాలు కోల్పోయిన అభాగ్యులకు తక్షణమే కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సురేష్మహారాజ్ , రవి ప్రకాష్, కృష్ణ, విజయ భాస్కర్, బాధితులు లావణ్య, కాంతమ్మ,పెద్దమ్మ, వెంకటేష్తదితరులు పాల్గొన్నారు.