అక్కడ చప్పట్లు కొట్టించుకుంటే ఇక్కడ జనం రాళ్లతో కొడతారు
– తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రా నేత అనుమతులు కావాలా?
– మా తెలంగాణ ప్రజల ఆమోదం ఉంటే చాలు
– మంత్రి హరీశ్ ఫైర్
మెదక్,మే29(జనంసాక్షి): తిరుపతిలో జరుగుతన్న మహానాడులో ప్రజలతో చప్పట్లు కొట్టించుకోవాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ జనం రాళ్లతో కొడతారని భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.గంగకత్వ కాలువ ఆధునికీకరణతో పాటు మిలిగిరిపేట, మాల్కాపూర్ చెరువులో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టడం సరికాదు అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. భూ నిర్వాసితులను తప్పకుండా అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. భూ నిర్వాసితులకు ఎకరాకు రూ. 6 లక్షల పరిహారం ఇస్తామన్నారు. ముంపు గ్రామాల ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందన్నారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కదని హెచ్చరించారు. 2013-భూసేకరణ చట్టం కంటే ఎక్కువ పరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
అనుమతులున్న ప్రాజెక్టులనే కడుతున్నాం
అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి మరింత కష్టపడాలని ఇంజినీర్లకు తెలంగాణ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈరోజు మెదక్ జిల్లా సంగారెడ్డి, సదాశివపేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రా నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ తెదేపా నాయకులు ఆంధ్రా పాలకులకు వంత పాడి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన హంద్రీనీవా, పట్టిసీమ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులిచ్చిన ప్రాజెక్టులనే తాము ఇప్పుడు కడుతున్నట్లు చెప్పారు. రాజకీయాల కోసం ప్రాజెక్టులు అడ్డుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.