అక్రమార్కుల జేబులు నింపుతున్న రేషన్ బియ్యం
అక్రమాలకు వేదికగా మారిన కల్వకుర్తి పట్టణం
• సుమారుగా 30 నుంచి 40 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
• రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్న జిల్లా యంత్రాంగం
• నామమాత్రపు కేసులతో సరిపెడుతూ….
నాగర్ కర్నూలు జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 జనం సాక్షి: స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో అలమటించవద్దనే సదుద్దేశంతో ఆపత్కాల సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సందర్భాన్ని బట్టి ఉచితంగా మరియు నిరుపేదల ఆర్థిక సోమతను దృష్టిలో ఉంచుకొని నామమాత్రపు ధరతో నిరుపేదలకు రేషన్ బియ్యం అందిస్తున్నాయి …. ఈ రేషన్ బియ్యం పేదవాడి కడుపు నింపుతుందో లేదో తెలియదు కానీ రైస్ మిల్లర్ ల జేబులు మాత్రం పూర్తిస్థాయిలో నింపుతుందని చెప్పవచ్చు . తాజాగా కల్వకుర్తి పట్టణంలో ఎల్లికల్ రోడ్డులో ఉన్న శ్రీనిధి రైస్ మిల్లులో గుట్టల కొద్దీ రేషన్ బియ్యం అటు అధికారులను ఇటు పట్టణవాసులను ఆశ్చర్యానికి గురిచేసాయి.
వివరాల్లోకి వెళితే కల్వకుర్తి పట్టణంలో లారీ అసోసియేషన్ సభ్యుల ను రైస్ మిల్లు లో భందించిన ఉదంతం బుధవారం వెలుగు లోకి రావడంతో అక్రమ వ్యాపారం బయటపడింది …. తమ లారీలకు కిరాయి చెప్పండి అని అడగడానికి వెళ్లిన లారీ అసోసియేషన్ సభ్యులను మిల్లు యాజమాన్యం అడ్డగించి నిర్బంధించడంతో మిల్లులో అక్రమ నిల్వ ఉన్న బియ్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది అధికారులు లారీ అసోసియేషన్ సభ్యులు కథనం ప్రకారం కల్వకుర్తి లారీ అసోసియేషన్ సభ్యులు ప్రతిరోజు మిల్లుల వద్దకు వెళ్లి వాహనాలు ఎక్కడికైనా పంపించాలని ఆరాతీస్తుంటారు బుధవారం రాత్రి ఇలాగే అసోసియేషన్ సభ్యులు ఎమ్ఏ రహీం ,షబ్బీర్ ,వాహబ్ ,యాదయ్య ,మక్బూల్ విజయ్, అర్జున్, డేవిడ్ తదితరులు ఒక వాహనంలో కల్వకుర్తి సమీపంలోని ఎన్నికల మార్గంలో ఉన్న మిల్లు వద్దకు చేరుకొన్నారు…. అక్కడ అసోసియేషన్ సంబంధంలేని లారీ కనిపించడంతో ఈ లారీ ఎక్కడిదని స్థానికంగా ఉన్న తమకి కాకుండా వేరే ప్రాంత లారీ యజమానులకు కిరాయిలు ఇస్తున్నారని యజమానిని అడిగారు…. దీంతో మిల్లు యజమాని స్పందిస్తూ సంబంధం లేని విషయంలో తలదూషరాదని హెచ్చరిస్తూ విద్యుత్ దీపాలను ఆఫ్ చేశారు, గేటు బయట తాళం వేయించి మిల్లులో పనిచేసే హమాలీలతో కొట్టిస్తానని బెదిరించారు దీంతో వారు చరవానుల ద్వారా అసోసియేషన్ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సభ్యులు మిల్లు వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టడంతో విషయం రెవెన్యూ, పోలీస్, పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలిసింది, వారు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మిల్లులో ఎక్కడ చూసినా బియ్యం మూటలు పడేసి ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు నరసింగరాజు, రవికుమార్, రామ్మోహన్, మిల్లులో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులు వచ్చేంతవరకు మిల్లులో ఉన్న లారీలతో సహా మిల్లును సీజ్ చేశారు. గురువారం ఉదయం నాగర్ కర్నూల్ డిఎస్ఓ మోహన్ బాబు ఆధ్వర్యంలో సీజ్ చేసిన మిల్లును ఓపెన్ చేసి అందులో ఉన్న బియ్యాన్ని పరిశీలించగా అనుమానిత పిడిఎస్ రైసుగా భావించి మిల్లులో ఉన్న సుమారు మూడు ఏసీకే ల(30 నుంచి 40 టన్నుల) రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి మిల్లు యజమాని పై కేసు నమోదు చేసినట్టు నాగర్ కర్నూలు జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు తెలిపారు .
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగం అనుబంధ రంగాలకు ఎన్నో వసతులు సదుపాయాలు కల్పించినప్పటికీ రైస్ మిల్లర్లు మాత్రం అక్రమ సంపాదన ధ్యేయంగా విచ్చలవిడిగా రేషన్ దందా నిర్వహిస్తూ అటు ప్రభుత్వాన్ని ఇటు ప్రజలను మోసం చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.
అక్రమార్కులను కట్టడి చేయాల్సిన అధికారులు నామమాత్రపు తనిఖీలతో అక్రమ వ్యాపారాలకు, వ్యాపారస్తులకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.