అగస్టా హెలీక్యాప్టర్లకు విదేశీ పరీక్షలపై కాగ్‌ అనుమానాలు

న్యూఢల్లీి, జూన్‌ 23 (జనంసాక్షి) :
అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలీక్యాప్టర్ల కొనుగోలు ఒప్పందంతో సహా వివిధ అంశాలపై కాగ్‌ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. రక్షణ మంత్రిత్వశాఖ రెండుసార్లు తోసిపుచ్చినప్పటికీ హెలీక్యాప్టర్ల పరిశీలన దేశం వెలుపల నిర్వహించడంపై అనుమానాలు లేవనెత్తింది. రూ.3600 కోట్ల విలువైన 12 వీవీఐపీ హెలీక్యాప్టర్ల ఒప్పదంపై కాగ్‌ మాజీ అధిపతి వినోద్‌ రాయ్‌ హయాంలో నివేదిక సమర్పించారు. ఆ నివేదికను ఏప్రిల్‌ 25న పార్లమెంట్‌కు సమర్పించారు. అమెరికాకు చెందిన సికోర్‌స్కీ, ఇంగ్లండ్‌, ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ సంస్థలకు చెందిన రెండు హెలీక్యాప్టర్లకు దేశం వెలుపల పరీక్షలు నిర్వహించడంపై కాగ్‌ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. మన దేశం కొనుగోలు చేసిన సదరు హెలీక్యాప్టర్లకు దేశంలోనే పరీక్షలు నిర్వహించాలన్న విషయాన్ని పేర్కొంది. దేశం వెలుపల పరీక్షలు నిర్వహించాలన్న విషయాన్ని పేర్కొంది. దేశం వెలుపల పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనలను రక్షణ శాఖ రెండు మార్లు తిరస్కరించడాన్ని తన నివేదికలో పేర్కొంది. హెలీక్యాప్టర్లను విదేశాల్లో పరీక్షించేందుకు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) రెండుసార్లు సిఫార్సు చేసినా అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని డిఫెన్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ బోర్డు (డీపీబీ) తోసిపుచ్చింది. అయినా హెలీక్యాప్టర్లకు దేశం వెలుపల పరీక్షలు నిర్వహించాలంటూ ఐఏఎఫ్‌ తరచూ ఒత్తిడి తీసుకువచ్చింది. దీన్ని రక్షణమంత్రి ఏకే ఆంటోని కూడా వ్యతిరేకించారు. చివరకు ఐఏఎఫ్‌ ఒత్తిడితో హెలీక్యాప్టర్లకు విదేశాల్లో పరీక్షకు సమ్మతి తెలిపారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు జనవరి 16, 2008లో ఇంగ్లండ్‌లో, సికోర్‌స్కీ హెలీక్యాప్టర్‌కు ఫిబ్రవరి 2008లో అమెరికాలో పరీక్షలు నిర్వహించారు.