అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
నిజామాబాద్, జనవరి 19 : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఈ నెల 21న నవ్యభారతి హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అగ్నిమాపకాధికారి మదుసుధన్ తెలిపారు. నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాల్లో చిక్కుకున్న వ్యక్తులను ఎలా రక్షించాలో గాయాలపాలైన వారికి ఎలాంటి ప్రథమ చికిత్సను అందించాలో విద్యార్థులకు ఆర్గనైజింగ్ ఫైర్ ఎవకేషన్ డ్రిల్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పాక్షికంగా కాపాడడం జరుగుతుందన్నారు. ప్రమాదాల్లో ఆస్తినష్టం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ అగ్నిమాపక అధికారి సతీష్‌కుమార్, కేంధ్రాధికారి బాబు, నవ్యభారతి ప్రిన్సిపల్ శ్రీదేవి, ఫైర్ సిబ్బంది చంద్రాగౌడ్, సుభాష్ తదితరులు ఉన్నారు.