అగ్రరాజ్యం మెరుగయ్యేనా!
రెండోసారి విజయం సాధించిన ఒబామా మంచిరోజులు ముందు న్నాయని విజయోత్సవ సభలో ప్రకటించారు. అయితే ఆయనకు తొలిసారి కంటే ఈసారి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. సమ స్యలకు కారణాలను మాజీ అధ్యక్షుడు బుష్‌పై నెట్టేందుకు వీల్లేదు. యుద్ధ వాతావరణానికి వ్యతిరేకంగా మార్పు తెస్తానని ప్రకటించిన ఒబామా ఈనాటికి అఫ్ఘనిస్తాన్‌లో తన సైన్యాన్ని ఉంచి ఆ రాజ్యంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోవైపు ఇరాన్‌పై ఈనాటికీ కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధంగా ఉండడం గమ నార్హం. దేశం ఆర్థిక మాంద్యం పరిస్థితులు అలానే ఉంటే జనవరి ఒకటి నుంచి ప్రజలపై పన్నుల భారం వేయడానికి ఒబామా సిద్ధమ వుతున్నారు. అదేవిధంగా సంక్షేమ పధకాల అమలుకు తూట్లు పొడుస్తూ 600 కోట్ల డాలర్ల మేరకు కోత విధించే దిశగా తన దృష్టి సారించారు. ఇలాంటి కోతలను సమర్ధవంతంగా అమలు చేసి వాల్‌స్ట్రీట్ లాభాలను కాపాడడంతో సమర్ధుడైన వాడు ఒబామా అని కార్పొరేట్ మీడియా కోడై కూస్తోంది. ఇది ఆయనకు ఈసారి ఎన్నికల్లో మంచి ఫలితాలనే రాబట్టింది. ఈఏడాది చివరి నాటికి తమ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల నిరుద్యోగం ఆరు శాతానికి తగ్గుతుందని ఒబామా చేసిన ప్రకటన అందనంత దూరంలో ఉంది. ఇప్పటికే రుణభారం విపరీతంగా పెరిగిపోయింది. నిరు ద్యోగం నీరుగారుస్తున్నా.. ఆర్థిక పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నా.. భయం వలదంటూ ప్రపంచంలో అత్యంత ధనిక దేశం మనది కాబట్టి మనం అందరికంటే వైవిధ్యంగా ముందుకు వెళదామని ఒబామా ఇస్తున్న భరోసా నేతిబీరకాయ చందంగానే ఉంటుంది. ఓటర్లను ఆకట్టుకోవాలంటే ఏ నాయకుడైనా ఎన్నుకునే ప్రజలను భయపెట్టకూడదు. రోజులు మారుతున్న కొద్దీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరణతిని సంతరించుకునే కొద్దీ ప్రజల్లో వాస్తవిక దృక్పథం రాటు దేలుతోంది. అమెరికాలో పట్టి పీడిస్తున్న వలస విధానం స్వలింగ సంపర్కాల మధ్య వివాహాలు అనేవి రుగ్మతులుగా మారి వెన్నాడుతు న్నాయి. ఒబామా విజయానికి ఈ నాలుగేళ్లల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎన్ని అవాంతరాలు, విమర్శలు ఎదురైనా అమలు చేస ిన విధానాలే ఆయన విజయానికి కొంతమేరకు దోహదం చేశా యి. కుదేలైన పారిశ్రామిక రంగాన్ని గట్టెక్కించాలంటే పరిశ్రమలను ఆదుకోవడం తప్ప మరో మార్గం లేదని భావించిన ఒబామా గత ఎన్నికల ముందే ఉద్దీపన పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి ఇచ్చిన ఊతం మెరుగైన ఫలితాలను సాధించినప్పటికీ ఆర్థిక మాంద్యం వెన్నాడు తూనే ఉంది. అయితే అవుట్‌సోర్సింగ్ వంటి అంశాలపై ఒబామా కొత్త యంత్రాంగం మరింత ఆచరణ సాధ్యమైన దీర్ఘకాలిక దృక్ప థం అనుసరిస్తే ఇప్పటికే భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామ్యం అయినందున 60శాతం మేరకు సాఫ్ట్‌వేర్ ఎగుమ తులకు అగ్రరాజ్యం అవరోధం లేకుండా దారి చూపగలదు. కానీ మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చే ముందే అవుట్‌సోర్సింగ్‌పై ఒబామా ప్రకటించే వ్యతిరేకత భారత ఐటీ సర్వీసులపై తీవ్రంగా పడిందన్న వాస్తవం మరువరానిది. వాస్తవానికి ఉత్పత్తుల రంగం లోని ఉద్యోగాలన్నీ అమెరికా నుంచి చైనాకు తరలిపోయాయి. అయితే అమెరికాకు ఐటీ నిపుణుల కొరత ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది. ఇందుకు ధీటుగా ఒబామా వలస విధానాల్లో సమగ్ర మైన మార్పులు తెస్తే వలసదారులకు మేలు జరుగుతుంది. అరి జోనా ప్రభుత్వం అవలంభిస్తున్న కఠిన ఇమ్మిగ్రేషన్‌చట్టాన్ని రోమ్నీ ప్రశంసించడం వల్లే అమెరికాలో గణనీయంగా ఉన్న వలసదారులు ఆయనకు పరాజయాన్ని కట్టబెట్టారు. మరి ఒబామా తిరిగి అలాం టి కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా భారత ఐటీతో సాధారణ వ్యాపార సంబంధాలు తిరిగి ప్రారంభిస్తారనే ఆశాభావం వ్యక్తమవు తోంది. గత ఎన్నికల్లోనూ అవుట్‌సోర్సింగ్‌పై ఎంతో ప్రచారం జరి గింది. కానీ.. ఈ నాలుగేళ్లల్లోను ఈ ప్రచారం ఏ విధంగానూ ప్రభావం చూపలేదు. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నట్టు రానున్న రోజుల్లో ఒబామా ఎన్నిక ఐటీ రంగంలోని అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామకంపై ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి. అమెరికా అధ్యక్షునిగా రోనాల్డ్ రీగన్ పాలించిన కాలానికి నేడు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం సర్వత్రా వ్యాపించి చీమ చిటుక్కుమన్న సమాచారం సర్వస్వం చేతికందే పరిస్థితుల్లో ప్రజలు నమ్మేది.. మెచ్చేది.. తమఆలోచనకు ధీటుగా నిలిచే నేతనే. అధికారాన్ని అప్ప గిస్తే అమాంతం పన్నులు తగ్గిస్తానని, ద్రవ్యోల్భణాన్ని మంత్రదం డంతో మటుమాయం చేస్తానని ఎంత చెప్పినా ప్రజలు నమ్మరన్న విషయం ఒబామాకు ఎరుకే అయినప్పటికీ చేసిన వాగ్ధానాలను చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే ఆయన తనకు లభించిన చారిత్రాత్మక విజయానికి సార్ధకత చేకూర్చగలరు.