అజ్మీర్ దర్గా సందర్శించిన పాక్ ప్రధాని ఆతిథ్యమిచ్చిన ఖుర్షిద్
జైపూర్, మార్చి9(జనంసాక్షి):
పాకిస్థాన్ ప్రధాని పర్వేజ్ అష్రాఫ్ ప్రముఖ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినొద్దీన్ షరీఫ్ దర్గాను శనివారం సందర్శించుకున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన పురాతన దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాకిస్తాన్ నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక చద్దర్‌ను సమర్పించారు. పాక్ ప్రధాని రాక సందర్భంగా అజ్మీర్‌లో గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టారు. దాదాపు 2 వేల మంది పోలీసులను మోహరించారు. అష్రాఫ్ చేరుకోగానే దర్గాలోని సందర్శకులను ఖాలీ చేయించారు. మధ్యాహ్నం సమయంలో దర్గాకు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు.జైపూర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 3.30 గంటల సమయంలో ఘుగారాకు చేరుకున్న ప్రధాని బృందం.. వాహనాల్లో దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ వాయిద్యాలతో ఆహ్వానించారు. దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అష్రాఫ్ ప్రత్యేక చద్దర్‌ను సమర్పించారు. గంట సేపు దర్గాలో గడిపిన అనంతరం ప్రధాని వాహనాల్లో ఘగారాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సాయంత్రం జైపూర్ చేరుకున్న అష్రాఫ్ బృందం.. ప్రత్యేక విమానంలో పాకిస్తాన్ బయల్దేరి వెళ్లింది. అనంతరం అష్రాఫ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన అక్కడ గడిపారు. ఒక్క రోజు వ్యక్తిగత పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన పాక్ ప్రధానికి ఘన స్వాగతం లబించింది. ప్రత్యేక విమానంలో జైపూర్‌కు చేరుకున్న అష్రాఫ్‌కు విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని గౌరవార్థం రామ్‌బాగ్ ప్యాలెస్ ¬టల్‌లో విందు ఇచ్చారు. విందు కార్యక్రమం అనంతరం అష్రాఫ్ అజ్మీర్‌కు బయల్దేరి వెళ్లారు. ఇదిలా ఉంటే, మరోవైపు పాక్ ప్రధాని పర్యటనను అజ్మీర్ దర్గా ఆధ్యాత్మిక గురువు జైనుల్ అబేదిన్ అలీఖాన్ బహిష్కరించారు. నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు భారత సైనికులను పాక్ దారుణంగా చంపి వారి తలలను నరికిన ఘటనకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పాకిస్థాన్ ప్రధాని పర్వేజ్ అష్రాఫ్ పర్యటనపై అజ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన పర్యటనను నిరసిస్తూ శనివారం స్థానిక న్యాయవాదులు, అజ్మీర్ దర్గా మార్కెట్ అసోసియేషన్ ఆందోళనలు చేపట్టాయి. ఇద్దరు భారత సైనికలను కిరాతకంగా హతమార్చడాన్ని నిరసిస్తూ.. పాక్ ప్రధాని పర్యటనను వ్యతిరేకించాయి. ఆయన పర్యటనను నిరసిస్తూ స్తానికంగా షాపులు మూసివేశారు. వీవీఐపీల పర్యటనల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా పోలీసులు షాపులను మూసివేయించే వారు. కానీ, అష్రాఫ్ పర్యటనను నిరసిస్తూ స్థానికులే స్వచ్ఛందంగా షాపులు మూసేసినట్లు దర్గా మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జోదా టెకచందనీ తెలిపారు. పాక్ ప్రధానికి తమ నిరసన తెలుపుతామని హెచ్చరించారు.