కొండచరియలు విరిగిపడి..


` 14 మంది దుర్మరణం..
` శిథిలాల కింద మరికొందరు
` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం
డార్జిలింగ్‌(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిరిక్‌- కుర్సియాంగ్‌ పర్యాటక ప్రదేశాలను కలిపే దుడియా ఐరన్‌ వంతెన కూలిపోయింది. కుర్సియాంగ్‌ సమీపంలోని జాతీయ రహదారి 110 వెంబడి కొండచరియలు విరిగిపడ్దాయి.ఉత్తర బెంగాల్‌ అంతటా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అతలాకుతలమయ్యింది. డార్జిలింగ్‌లోని మిరిక్‌, సుఖియా పోఖారిలలో కొండచరియలు విరిగిపడి 14 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పశ్చిమ బెంగాల్‌ – సిక్కిం మధ్య రోడ్డు సంబంధాలు తెగిపోయాయి. డార్జిలింగ్‌- సిలిగురి మధ్య ప్రధాన రహదారి మూసుకుపోయింది. భారీ వర్షపాతం జల్పైగురి, సిలిగురి, కూచ్‌బెహార్‌లను ప్రభావితం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. చిత్రే, సెల్ఫీ దారా తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారి-10లో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.సోమవారం ఉదయం వరకు పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. డార్జిలింగ్‌, కాలింపాంగ్‌, కూచ్‌ బెహార్‌, జల్పైగురి, అలీపుర్దువార్‌ జిల్లాలలో ఆదివారం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఈ ప్రాంతంలో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఉత్తర బెంగాల్‌లోని పొరుగు జిల్లా అలీపుర్దువార్‌లో సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన బులెటిన్‌లో పేర్కొంది.పశ్చిమ జార్ఖండ్‌, దక్షిణ బీహార్‌, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా ఆవరించిన అల్పపీడనం ఉత్తర-ఈశాన్య దిశగా బీహార్‌ వైపు కదిలి, క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ముర్షిదాబాద్‌, బిర్భూమ్‌, నదియా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో పశ్చిమ బెంగాల్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని, బంకురాలో అత్యధికంగా 65.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

 

నేపాల్‌లో వరద బీభత్సం..
` 28 మంది మృతి
ఖాట్మండు(జనంసాక్షి):నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖాట్మండులో భారీ వర్షాల కారణంగా పొంగిపొర్లుతున్న బాగ్మతి నది ఒడ్డు సమీపాన ఉన్న ప్రజలు ముప్పు బారిన పడ్డారు. వారిని నేపాల్‌ ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గడచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఆకస్మిక వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వంతెనలు కొట్టుకుపోయాయి . విపత్తు ప్రమాదాల్లో 28 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు.భారతదేశానికి తూర్పున సరిహద్దులో ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది మరణించారని పోలీసు ప్రతినిధి బినోద్‌ ఘిమిరే తెలిపారు. దక్షిణ నేపాల్‌లో పిడుగుపాటుకు ముగ్గురు మరణించగా, ఉదయపూర్‌ జిల్లాలో వరదలకు ఒకరు మృతిచెందారని ఆయన తెలిపారు. వరదల కారణంగా 11 మంది కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధి శాంతి మహత్‌ మీడియాకు తెలిపారు.భారతదేశానికి తూర్పున సరిహద్దులో ఉన్న ఇలాం జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 18 మంది మరణించారని పోలీసు ప్రతినిధి బినోద్‌ ఘిమిరే తెలిపారు. దక్షిణ నేపాల్‌లో పిడుగుపాటుకు ముగ్గురు మరణించగా, ఉదయపూర్‌ జిల్లాలో వరదలకు ఒకరు మృతిచెందారని ఆయన తెలిపారు. వరదల కారణంగా 11 మంది కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. విపత్తు సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రతినిధి శాంతి మహత్‌ మీడియాకు తెలిపారు.

భూటాన్‌ను ముంచెత్తిన వరదలు..
` సహాయచర్యల్లో భారత సైన్యం
థింపు(జనంసాక్షి):కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పొరుగుదేశం భూటాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నదీ పరివాహ ప్రాంతాల్లో ఆకస్మిక వరదల కారణంగా వేలమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. దీంతో అక్కడి ప్రజలకు సహాయం అందించేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. భూటాన్‌ అధికారులు, భారత సైనికులు సంయుక్తంగా చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భూటాన్‌ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల వల్ల ప్రతికూల వాతావరణం కారణంగా బాధితులను తరలిస్తున్న భూటాన్‌ హెలికాప్టర్‌ పని చేయకపోవడంతో ఆ దేశం భారత్‌ను అత్యవసరం సాయం కోరిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే స్పందించిన భారత్‌ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించి.. వారికి తక్షణ వైద్య సహాయం అందేలా రెండు హెలికాప్టర్లను మోహరించిందని తెలిపాయి. మరోవైపు నేపాల్‌లోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో తూర్పు నేపాల్‌లో శనివారం రాత్రి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. నేపాల్‌లో నెలకొన్న ప్రకృతి విపత్తుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌.. నేపాల్‌ ప్రజలకు అండగా ఉంటుందని..అక్కడి ప్రజలకు అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.