మరో గాడ్సే..
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం
` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం
` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న భద్రత సిబ్బంది,మిగతా లాయర్లు
` అనూహ్య ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం
` ఇలాంటి బెదిరింపులు ప్రభావితం చేయలేవు
` తేల్చి చెప్పిన సీజేఏ
` ఘటనను తీవ్రంగా రాహుల్ గాంధీ
` బీఆర్ గవాయ్‌తో ఫోన్లో మాట్లాడిన మోదీ
` దాడి ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఓ కేసులో వాదనలు వింటున్న జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించారు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది, మిగతా న్యాయవాదులు సదరు లాయర్‌ను అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో కోర్టులో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం ఓ కేసు విచారణ జరుగుతోంది. ఆ సమయంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ఉన్న వేదిక వద్దకు వెళ్లి బూటు విసిరేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ న్యాయవాదిని అడ్డుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సనాతన ధర్మానికి అవమానం జరిగితే సహించేది లేదని ఆ న్యాయవాది గట్టిగా నినాదాలు చేశారు. సీజేఏ ఏమాత్రం కంగారు పడకుండా కోర్టులో ఉన్న న్యాయవాదులను తమ వాదనలు కొనసాగించమని కోరారు. ఇలాంటి బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవని జస్టిస్ గవాయ్ తేల్చి చెప్పారు. అయితే దాడి యత్నం నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద పలువురు న్యాయవాదులు ఆందోళన చేశారు. అయితే ఘటనకు కారణమైన న్యాయవాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
జస్టిస్‌గవాయ్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
మరోవైపు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌తో మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సర్వోన్నత న్యాయస్థాన ప్రాంగణంలోనే సీజేఐపై దాడి ప్రతి ఒక్క భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసిందని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన ఆయన, ఇలాంటి చర్యలకు సమాజంలో చోటు లేదని తెలిపారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ సీజేఐ గవాయ్ చూపిన శాంతియుత ధోరణిని ప్రశంసించిన మోదీ, న్యాయం పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను ఇది చాటుతుందన్నారు. సీజేఐ గవాయ్‌పై దాడిని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిరచింది.విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన ఓ కేసు పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ దాడి యత్నం జరిగినట్లుగా తెలుస్తోంది. మధ్యప్రదేశ్ ఖజురహోలోని జవారీలో ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించి, తిరిగి ప్రతిష్ఠించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సమయంలో ఇది ప్రచార ప్రయోజన పిటిషన్‌గా ఉందనీ, వెళ్లి ఏదో ఒకటి చేయాలని మీ దేవుడినే అడగండని సీజేఐ పేర్కొన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని సీజేఐ జస్టిస్ గవాయ్ తోసిపుచ్చారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సోషల్? మీడియాల్లో పలురకాల స్పందనలు వస్తున్నాయని తనకి ఒకరు చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించడాన్ని ఆయన కోర్టులో ప్రస్తావించారు. ఈ విషయంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. పదేళ్లుగా జస్టిస్ గవాయ్ తనకు తెలుసని, ఆయన అన్ని మతాలకు చెందిన ఆలయాలను సమాన భక్తి శ్రద్ధలతో సందర్శిస్తారని తెలిపారు. ఏ దేవుడినీ అవమానించాలన్న ఆలోచన కూడా చేయరని పేర్కొన్నారు. ప్రతి చర్యకూ సమానమైన ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ సిద్ధాంతాన్ని మనం నేర్చుకున్నామని, ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో దీని అర్థం మారిపోయిందని చెప్పారు. ప్రతి చర్యకూ తప్పుడు, విపరీతమైన, అతి ప్రతిచర్య ఉంటోందని తెలిపారు. సంబంధంలేని అంశాలను తీసుకొచ్చి సీజేఐకి అంటగట్టారని స్పష్టం చేశారు. సీనియర్ అడవ్కేట్ కపిల్ సిబల్ కూడా స్పందించారు. సోషల్ మీడియా అనేది కళ్లెం లేని గుర్రంలాంటిదని అన్నారు. దానిని అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యనించారు. ఈ విషయంలో ప్రతిరోజూ బాధపడుతున్నామని తెలిపారు.