ఈవీఎంలో ఇక అభ్యర్థుల కలర్‌ ఫొటోలు

– ఎన్నికల సంఘం ప్రకటన
న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్‌ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను ఉంచనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజుల పాటు పర్యటించి, సమీక్షించిన ఎన్నికల సంఘం.. వీటికి సంబంధించిన వివరాలను పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడిరచింది. ఈ సందర్భంగా పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్‌ ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టం చేసింది. చట్టానికి లోబడే ఆధార్‌ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది.‘‘అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశాం. గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం ఉండనుంది. ఇప్పటికే బూత్‌ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశాం. ఎన్ని దశల్లో పోలింగ్‌ నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్‌ పేపర్లలో అభ్యర్థుల కలర్‌ ఫొటోలను ఉంచనున్నాం. తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తు పట్టేందుకు వీలుంటుంది. సీరియల్‌ నంబర్‌ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ వెల్లడిరచారు. ఎస్‌ఐఆర్‌ ద్వారా అనర్హులను జాబితా నుంచి తొలగించామని, దీన్ని బిహార్‌ ఓటర్లు కూడా స్వాగతించారని చెప్పారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందన్నారు.243 స్థానాలు కలిగిన బిహార్‌ అసెంబ్లీకి గడువు 2025 నవంబర్‌ 22తో ముగియనుంది. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా పూర్తి చేస్తామని చెప్పింది. అయితే, ఒకటి, రెండు దశల్లోనే వీటిని పూర్తి చేయాలనే అభ్యర్థనలు వచ్చాయని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2020లో మూడు విడతల్లో పోలింగ్‌ జరగ్గా.. అంతకుముందు (2015లో) ఐదు విడతల్లో పోలింగ్‌ జరిగింది. ఇదిలాఉంటే, రాష్ట్రంలో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ఇటీవల వెల్లడిరచింది.