బీసీలకు 42% జీవోపై హైకోర్టు స్టే

` నోటిఫికేషన్‌నూ నిలుపుదల చేస్తూ ఆదేశాలు
` ఆరు వారాల పాటు నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ
` కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
` రెండురోజుల పాటు హైకోర్టులో సమగ్ర వాదనలు
` నోటిఫికేషన్‌ ఇచ్చాక కోర్టులు జోక్యం చేసుకోరాదన్న ఏజీ
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్‌ పడిరది.స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జీఓ 9పై హైకోర్టు స్టే విధించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ పైనా స్టే విధించి షాక్‌ ఇచ్చింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను 4 వారాలపాటు వాయిదా వేసింది. అనంతరం రెండు వారాల్లోపు అన్ని పార్టీలు కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అయితే, జీవో 9 విడుదల అనంతరం హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు బుధవారం పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టి నేటికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మసనం.. ప్రభుత్వం తరఫు వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత.. రెండు వారాల్లోపు కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల పక్రియపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 9పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్టే ఇచ్చింది. రిజర్వేషన్ల అంశంపై విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. నాలుగు  బీసీ రిజర్వేషన్లపై రెండురోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారమే స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్‌ విలువడిరది.  నోటిఫికేషన్‌పై సైతం హైకోర్టు స్టే విధించింది. దాంతో ఎన్నికల పక్రియ నిలిచిపోనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్‌ 9ని జారీ చేసింది. ఈ జీవోను సవాల్‌ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఆర్‌ కృష్ణయ్య, వీ హన్మంతరావుతో పాటు పలువురు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. ఆయా అన్ని పిటిషన్లను సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ ప్రారంభించింది. తాజాగా రిజర్వేషన్ల అంశంపై గురువారం సైతం వాదనలు కొనసాగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ వెలువడిరదని కోర్టుకు చెప్పారు. కొందరు ఇది నోటిఫికేషన్‌ కాదంటున్నారని.. అది తప్పని ఏజీ చెప్పారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పత్రులను ఏజీ ధర్మాసనం ఎదుట ఉంచారు. నోటిఫికేషన్‌ వచ్చాక న్యాయస్థానాల జోక్యం ఉండదని.. నోటిఫికేషన్‌ వచ్చాక జోక్యం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అయితే, రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని పిటిషనర్లు
తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లు, ప్రభుత్వానికి నాలుగు వారాలు సమయం ఇచ్చింది. మళ్లీ నాలుగు వారాల తర్వాత రిజర్వేషన్ల అంశంపై విచారణ జరుగనున్నది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి.ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
గవర్నర్‌ సంతకం చేయకుంటే చట్టం అయినట్లే..:ఏజీ
హైదరాబాద్‌(జనంసాక్షి):గవర్నర్‌ బిల్లును పాస్‌ చేయకుంటే చట్టంగా మారినట్టేనని అడ్వకేట్‌ జనర్‌ సుదర్శన్‌ రెడ్డి ధర్మాసనం ముందు వాదించారు. ఇందుకు తమిళనాడు ఉదాహరణను ఆయన చూపారు.  బీసీ కుల గణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని.. స్వాతంత్య్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని చెప్పారు. ఈ సర్వేపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. బీసీ జనభా 57.6 శాతం ఉన్నారంటే ఎవరూ కాదనడం లేదని.. 57.6 శాతం జనాభా ఉన్నా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గుర్తించి తీర్మానం చేసిందని.. గ్రావిూణ, పట్టణ సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందన్నారు. గడువులోగా గవర్నర్‌ ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుందని.. తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు తెలిపారు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూతప్రాయ ఆమోదం ఉందని.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చట్టానికి సూతప్రాయ ఆమోదం ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల కోరిక అని.. దాన్ని అసెంబ్లీ ఆమోదించిందన్నారు. శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగిందని.. సర్వేలో అన్ని కులాల లెక్కలు తేలాయన్నారు. బీసీ సబ్‌ కేటగిరిల వారీగా వివరాలు సర్వేలో తేలాయన్నారు. సర్వేలో అగ్రవర్ణాల లెక్కలు బయటకు వచ్చాయన్నారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూతప్రాయ ఆమోదం ఉంది. ఇది రాష్ట్ర ప్రజల కోరిక. దాన్ని అసెంబ్లీ ఆమోదించింది.శాస్త్రీయ పద్ధతిలో కులగణన సర్వే జరిగింది. సర్వేలో అన్ని కులాల లెక్కలు తెలిశాయి. బీసీల్లోని సబ్‌ కేటగిరీల వారీగా వివరాలు సర్వేలో తేలాయి. అగ్రవర్ణాల లెక్కలు కూడా బయటకు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిరది. కొందరు ఇది నోటిఫికేషన్‌ కాదంటున్నారు. అది తప్పని ఏజీ పేర్కొన్నారు. నోటిఫికేషన్‌ ప్రతులను ధర్మాసనం ముందుంచారు. నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వాదించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టు కూడా స్పష్టం చేసినట్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్‌ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
2 రిజర్వేషన్‌ సాధించేవరకు పోరాడుతాం
` సీఎం రేవంత్‌తో చర్చించి తదుపరి కార్యాచరణ: మంత్రి వాకిటి శ్రీహరి
` హైకోర్టు స్టే ఊహించలేదు
` ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాం
` ఉత్తర్వు కాపీలు అందాక తదుపరి కార్యాచరణ:మంత్రి పొన్నం
` ఇది ముమ్మాటికీ బీఆర్‌ఎస్‌, బీజేపీల ద్రోహం
` చట్టం చేకుండా అడ్డుకున్న రెండు పార్టీలు
` మండిపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌9 అమలుపై హైకోర్టు స్టే విధించిన క్రమంలో తదుపరి కార్యాచరణ చేపడతామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఉన్నత న్యాయస్థానం నిర్ణయంతో బీసీల నోటి వద్ద ముద్ద లాగేసినట్లయిందని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. బీసీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరతామన్నారు. కోర్టు తీర్పు కాపీ చూసిన తర్వాత ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తామని చెప్పారు. హైకోర్టు తీర్పు కాపీ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తాం. సుప్రీం కోర్టుకు వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటాం. కోర్టులో కేసులు వేయించింది భారత రాష్ట్ర సమితే. భాజపాతో కుమ్మక్కై బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంది. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించాం అని వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.స్థానిక ఎన్నికలకు హైకోర్టు స్టే విధించడంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. బీసీలకు 42 శాతంపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన కూడా స్టే విధించడం విచారకరమని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌ కొలిక్కి వచ్చిందనుకున్నాం.. కానీ కోర్టు తీర్పు ఊహించలేదని చెప్పారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. బీసీల నోటి కాడ కూడు లాగేయడం శోచనీయమని పేర్కొన్నారు. నోటి కాడ ముద్ద ఎవరు లాగేసారో కోర్ట్‌ తీర్పు కాపీ వచ్చాక చెబుతామని హెచ్చరించారు. 42 శాతం బీసీల రిజర్వేషన్‌ కు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీ బిడ్డలు అధైర్య పడాల్సిన అవసరం లేదని. .కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్‌ బిల్లును రెండు సభల్లో పాస్‌ చేసి గవర్నర్‌ కు పంపించామని.. గవర్నర్‌ బిల్లు పాస్‌ చేయకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టం చేకుండా అడ్డుకున్న రెండు పార్టీలు
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించడంపై కాంగ్రెస్‌ నేతలు  స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో ఎవరు చేయలేని సాహసం చేసిందని వ్యవసాయ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బిసి బిల్లును అడ్డుకున్నదే బిజెపి అన్నారు. బిజెపిని నిలదీయమాల్సిన అసవరం ఉందన్నారు.   ఇంటింటికి తిరిగి కులగణనం చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల రూపొందించామని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ ` బీజేపీ ఒక్కటై బీసీలకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం 42 శాతం బీసీల రిజర్వేషన్‌ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. బీసీలకు న్యాయం జరగాలనిఅభిప్రాయపడ్డారు. బిఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఒక్కటై బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ చిత్తశుద్దితో చట్టం చేసిందన్నారు. అడ్డుకున్నదే బిజెపి అన్నారు.
హైకోర్టులో స్టే రావడం బాధాకరం:పొన్నం
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తరువాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం తరుఫున హైకోర్టులో బలమైన వాదనలు వినిపించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్‌ కమిషన్‌ వేసి, సబ్‌ కమిటీ వేశామని గుర్తు చేశారు. అనంతరం కేబినెట్‌ ఆమోదించి.. శాసనసభలో చట్టం చేసి గవర్నర్‌కి బీసీ బిల్లును పంపడం జరిగిందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ధీమా వ్యక్తం చేశారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్‌ కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్‌ కాలేదో జవాబు చెప్పాలని పొన్నం నిలదీశారు. తమ నాయకుడు రాహుల్‌ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.
42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
` ఆ తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలకు వెళ్తాం
` బీఆర్‌ఎస్‌, బీజేపీలకు చిత్తశుద్ది లేదు
` ఆ పార్టీ నాయకులు హైకోర్టులో ఇంప్లీడ్‌ కాలేదు
` టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):బీసీల విషయంలో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అందరికీ తెలుసని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం చేస్తున్న కార్యక్రమాలను వాళ్లు గమనిస్తున్నారని చెప్పారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితర నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు మేలు చేయడాన్ని భారత రాష్ట్ర సమితి, భాజపా నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి, భాజపా నేతలు హైకోర్టులో ఇంప్లీడ్‌ కాలేదన్నారు. ఈ పార్టీల నేతలు చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసింది తమ ప్రభుత్వమేనని చెప్పారు.‘‘రిజర్వేషన్లపై మాకు సంకల్పబలం ఉంది. అందుకే ఇక్కడివరకు చేరుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై కొందరు కోర్టుకు వెళ్లారు. 2018లో భారత రాష్ట్ర సమితి తెచ్చిన చట్టం ఇప్పుడు ఓబీసీలకు ఉరితాడుగా మారింది. ఓబీసీలకు మేలు చేద్దామన్న ఆలోచన ఆ పార్టీకి లేదు. మా ప్రభుత్వంపై లేనిపోని అభాండాలు వేస్తున్నారు. మీ అబద్ధాలు నమ్మేందుకు బీసీలు, సంఘాల నేతలు అమాయకులు కాదు. ఏం లెక్కలున్నాయో చెప్పాలని అడిగారు కనుకే కులగణన చేశాం. జీవో ఇచ్చేసి ఎన్నికలకు వెళ్తే దాన్ని కొట్టేసేవారు. అందుకే శాస్త్రీయంగా కులగణన చేపట్టి బిల్లు పాస్‌ చేశాం. లక్షమందికిపైగా ఉద్యోగులను పంపి వివరాలు సేకరించాం.క్యాబినెట్‌లో, అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఆ రోజు బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. గవర్నర్‌ ఆ బిల్లును రాష్ట్రపతికి పంపారు. అక్కడ పెండిరగ్‌లో ఉంది. ఆ బిల్లును ఆపిందెవరో కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం చెప్పాలి. ఎవరికి చిత్తశుద్ధి ఉందో.. ఎవరికి లేదో ప్రజలు ఆలోచించాలి. బీసీల బిల్లును భాజపా, భారాస కలిసి అడ్డుకుంటున్నాయి. ఈ నేతల వైఖరి చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. కుట్రలు, కుతంత్రాలు చేస్తుందెవరో అందరికీ తెలుసు. రిజర్వేషన్లకు పరిమితి పెట్టింది భారాస.. బిల్లు ఆపింది భాజపా. ఈ పార్టీల నేతలను ఓబీసీలు ఎప్పటికీ క్షమించరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చేవరకు రాజకీయంగా, కోర్టులో పోరాడతాం’’ అని నేతలు మాట్లాడారు.
న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో మభ్యపెట్టారు
` ఇంతకాలం చేసిందంతా డ్రామా అని తేలిపోయింది : కేటీఆర్‌
` ఆరు గ్యారంటీల తరహాలోనే బీసీలకు 42శాతం డ్రామాలు
` 55 ఏళ్లు అధికారంలో ఉన్నా బీసీలకు మొండిచెయ్యే: హరీశ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులపాటు మోసపూరితంగా వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైకోర్టు ఇచ్చిన స్టే తో 42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్‌ సర్కారు ఇంతకాలం చేసిందంతా డ్రామా తప్ప మరొకటి కాదని రుజువైపోయిందని ఆయన పేర్కొన్నారు. కేవలం కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలు, చట్టం పరీక్షకు నిలవకుండా వ్యవహరించిన తీరు వల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ దక్కకుండా పోయిందని కేటీఆర్‌ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాలరాసి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలోని బీసీలను దారుణంగా మోసం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. కేవలం మభ్యపెట్టేందుకు తెచ్చిన జీఓ న్యాయస్థానాల్లో నిలబడదని బీఆర్‌ఎస్‌ చెప్పిన మాట అక్షరాలా నిజమని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు.కులగణనను మొదలుకుని జీఓ దాకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అడుగడుగున చేసినదంతా మోసం, దగా, నయవంచన తప్ప మరొకటి కాదు. కులగణన నుంచి మొదలుకొని ప్రతి సందర్భంలో కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న మోసాన్ని అనుసరిస్తున్న తప్పుడు విధానాలను ఎప్పటికప్పుడు బీఆర్‌ఎస్‌ తరఫున ప్రభుత్వానికి అనేక సూచనలు చేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. అసెంబ్లీలో పాస్‌ చేసిన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్లాల్సింది పోయి, ఏకపక్షంగా దేశ రాజధానికి వెళ్లి ధర్నా పేరిట నాటకమాడారు’’ అని కేటీఆర్‌ విమర్శించారు. ఎన్నికలకి ముందు రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి 42 శాతం బీసీలకు పదవులు కట్టబెడతామని చెప్పి, పూటకొక మాటను కాంగ్రెస్‌ మార్చిందన్నారు. చివరికి రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి చేసుకున్నాక రిజర్వేషన్లు సాధిస్తామని చెప్పిన అడ్డగోలు మాటల్ని కూడా కేటీఆర్‌ గుర్తు చేశారు.ఒకవైపు రాష్ట్రపతి వద్ద బిల్లు పెండిరగ్‌ లో ఉండగానే ఆర్డినెన్స్‌ పేరిట కొంతకాలం హంగామా చేశారని, చివరికి న్యాయస్థానాల్లో నిలబడని జీఓతో మభ్యపెట్టారని ఆయన అన్నారు. బీసీలకు చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని తుంగలో తొక్కి, పార్టీ పరంగా ఇస్తామని ప్రతిపాదనలు తెరపైకి తెచ్చిన నాడే కాంగ్రెస్‌ మోసం బయటపడిపోయిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.22 నెలల చేతకాని పాలనపై ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం, వ్యతిరేకతను చూసి ముఖ్యమంత్రి భయంతో వణికిపోతున్నారని కేటీఆర్‌ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాని ప్రభుత్వం మరోవైపు తన అసమర్థ పరిపాలన విధానాలతో ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను కార్యక్రమాలను ఆపేసి తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని, అందుకే స్థానిక ఎన్నికలను వివాదంగా మార్చి, ఏదో రకంగా వాయిదా వేయించేందుకు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పావుగా వాడుకున్నారు అని ఆయన దుయ్యబట్టారు.‘‘రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ చేసిన దగాకు తోడు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీ బిల్లులను పెండిరగ్‌ లో పెట్టి వెనుకబడిన వర్గాలను దారుణంగా వెన్నుపోటు పొడిచింది’’ అని కేటీఆర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను, ముఖ్యమంత్రి చేసిన దుర్మార్గాన్ని చూసి రాష్ట్రంలోని బలహీనవర్గాల ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికే పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు అవస్థలు పడుతున్నారని కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పనికిరాని జీవోతో రాష్ట్రంలోని బీసీలను, గారడీ మాటల గ్యారెంటీ కార్డుతో నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలను వంచించిన కాంగ్రెస్‌ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు’’ అని కేటీఆర్‌ హెచ్చరించారు.
ఆరు గ్యారంటీల తరహాలోనే బీసీలకు 42శాతం డ్రామాలు:హరీశ్‌
ఆరు గ్యారంటీల తరహాలోనే 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ డ్రామాలు ఆడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిరదా? అంటూ ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే విూ కాంగ్రెస్‌ నేతలు జాతీయ నాయకులతో ఢల్లీి వేదికగా కోట్లాడాలని హితవు పలికారు. కలిసి వచ్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయన్నారు. 22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢల్లీిలో కొట్లాడాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి.. గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్‌ చేశారు తప్పా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం, 42శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్‌రెడ్డి తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారని.. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీశారని.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారన్నారు. రేవంత్‌ రెడ్డి ఇప్పటికైనా విూ డ్రామాలు ఆపాలని.. బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే 42శాతం పెంపు విషయమై ఢల్లీిలో కొట్లాడాలని చెప్పారు. పార్లమెంట్‌లో చట్టం చేయించి, షెడ్యుల్‌ 9లో చేర్చాలని.. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఢల్లీి వేదికగా యుద్ద భేరి మోగించాలని.. ద్యమ పార్టీగా బీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుందని.. ఢల్లీిని నిలదీస్తుందన్నారు.
బీసీలకు అన్యాయం జరిగింది
` బీసీ సంఘాల నిరసన
` నోటిఫికేషన్‌ ఇచ్చాక స్టే ఎలా ఇస్తారు?
` నోటికాడ ముద్ద లాగేసుకున్నారు
` సుప్రీం తీర్పును పట్టించుకోని హైకోర్టు
` ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తాం
` ఎంపి, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు,.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ సందర్భంగా హైకోర్టు వద్ద ఆర్‌.కృష్ణయ్య విూడియాతో మాట్లాడారు..బీసీల నోటికాడ ముద్దను ఆపారని ఆర్‌.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తొందరపాటు చర్యలతో అన్యాయం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ స్పందన చూశాక బంద్‌కు పిలుపునిస్తామని పేర్కొన్నారు. కొంతమంది బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్‌.కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి సాయంత్రంలోగా స్పందించక పోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల పక్రియను రెండు వారాల పాటు ఆపడమనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు.. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉండేదన్నారు. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం స్పందన ఏంటో చూస్తాం. తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చి రాష్టాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. బీసీల్లో ఏంతో చైతన్యం వచ్చింది.. ఊరురా స్పందన తెలుపుతాం. సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. సాయంత్రంలోగా ప్రకటించాలి. లేదంటే పెద్ద ఎత్తున బంద్‌ నిర్వహిస్తాం. దేశాన్ని కదిలించేలా బంద్‌ ఉంటుంది. ఏం తమాషాగా ఉందా..? బీసీలంటే అంత చులకనగా ఉందా..? ముఖ్యమంత్రి పదవులు రావు మంత్రి పదవులు రావు.. లేక లేక సర్పంచ్‌ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని ఆర్‌ కృష్ణయ్య హెచ్చరించారు.
రాజకీయ ప్రయోజనాలకోసమే రిజర్వేషన్‌ నాటకాలు
రేవంత్‌ సర్కార్‌ చేతకానితనం వెల్లడైంది
బిసి రిజర్వేషన్లపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి
స్టే రావడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే కారణం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు
న్యూఢల్లీి(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ బీసీలను రాజకీయంగా వాడుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన కాంగ్రెస్‌ పార్టీకి ఏనాడూ లేదని ఆరోపించారు.   బీసీ రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 9పై హైకోర్టు స్టే విధించడంపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానం దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్‌ సర్కార్‌ చేతకాని తనం కారణంగానే.. ఈ తీర్పు వెలువడిరదని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. అందుకే ముందగానే ప్లాన్‌ ’బీ’ని సిద్ధం చేసుకుని ఇవాళ హైకోర్టులో తూతూమంత్రంగా వాదనలు వినిపించిందని కిషన్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే.. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50? క్యాప్‌ను నిర్దేశిరచిందని గుర్తు చేశారు. ఈ విషయం తెలిసినా.. రాజ్యాంగపరమైన నిబంధనలపై కనీస అవగాహన లేకుండా రేవంత్‌ సర్కారు వ్యవహరించిందని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్టే రావడానికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం: రామ్‌చందర్‌ రావు
బీసీ రిజర్వేషన్లపై స్టే రావడానికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌ రావు ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్‌లకు బీజేపీ మద్దతు పలుకుతోందని స్పష్టం చేశారు. బీసీల అంశాని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం వాడుకుంటోందని విమర్శించారు. గవర్నర్‌కి పంపిన తర్వాత బిల్లు కోసం 3 నెలల సమయం ఉంది.. ఎందుకు తొందర పడుతునారని సూచించారు. బిల్లు ఆమోదానికి 3 నెలల సమయం ఉండగా ఎందుకు బిల్లు తెచ్చారో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని రామ్‌చందర్‌ రావు నిలదీశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టే.. ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటుందని మాట్లాడుతారు తప్ప.. కనీసం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌ నేతలు మైండ్‌ అప్లై చేశారా.. అని ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ఇచ్చిన బాధ్యత విూది. ఆర్డినెన్సు తెచ్చింది విూరు.. బిల్లు తెచ్చింది విూరు.. కానీ బీజేపీనీ అంటునారని రామ్‌చందర్‌ మండిపడ్డారు. విూరిచ్చిన హావిూని విూరు అమలు చేయకుండా బిజెపిపై విమర్శలు ఎలా చేస్తారని అన్నారు.