అట్టడుగున ఢిల్లీ

  

ఐపీఎల్‌ నుంచి వైదొలగిన డేర్‌ డెవిల్స్‌

పుణె వారియర్స్‌ ఘన విజయం

పుణె :

ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు అట్టడుగున నిలిచింది. ప్లే ఆఫ్‌కు చేరకుండానే ఇంటికి చేరింది. ఆదివారం పుణెలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్‌ జట్టుపై పుణె వారియర్స్‌ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పుణె జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ ఎతప్ప 20 బంతుల్లో 24 పరుగులు చేసి యాదవ్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఫించ్‌ దూకుడుగా ఆడి 34 బంతుల్లో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. కౌల్‌ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పాండే 14 బంతుల్లో 10 పరుగులు చేసి వికెట్‌ కోల్పోయాడు. యువరాజ్‌ సింగ్‌ 3, మాథ్యూస్‌ 30 (నాటౌట్‌), రైట్‌ 44, గోమెజ్‌ 4 పరుగులు చేశారు. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డేర్‌ డెవిల్స్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లను కోల్పోయి 134 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ జయవర్ధనే 13 బంతులు ఆడి 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ముర్తాజా బౌలింగ్‌లో రైట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్‌ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేక పోయాడు. 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి పార్నెల్‌ బౌలింగ్‌లో ఉతప్పకు క్యాచ్‌ ఇచ్చాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన చిప్లి 18 బంతుల్లో 16 పరుగులు చేసి ముర్తాజా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు. వీరెంద్ర సెహ్వాగ్‌ 11, రోహ్రర్‌ 7, పఠాన్‌ 24, గౌతం 30, యాదవ్‌ 8 (నాటౌట్‌), నదీం 6 పరుగులు చేయగా మార్కెల్‌ డకౌట్‌ అయ్యాడు. ముంబయి జట్టులో కౌల్‌ 2, పటాన్‌, యాదవ్‌, నదీం ఒక్కో వికెట్‌ తీశారు. పుణె బౌలర్లలో మాథ్యాస్‌ 3, మోర్తజా 3, దిండా 2, పార్నల్‌ ఒక వికెట్‌ తీశారు.