అట్టుడుకుతున్న తూత్తుకుడి

– ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేత
– 13కు చేరిన మృతుల సంఖ్య
– 67మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– ఐదు రోజులు ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేసిన అధికారులు
– సీఎంను కలిసేందుకు సచివాలయానికి వచ్చిన స్టాలిన్‌
– అనుమతి లేదంటూ అడ్డుకున్న సీఎంవో సిబ్బంది
– నేడు బంద్‌కు పిలుపునిచ్చిన డీఎంకే
చెన్నై, మే24(జ‌నం సాక్షి) : స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా తమిళనాడులోని తూత్తుకుడిలో చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో స్టెరిలైట్‌ రాగి కర్మాగారం విస్తరణను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఆందోళనల నేపథ్యంలో కర్మాగారానికి విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున 5 గంటల నుంచి ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా మంగళవారం తూత్తుకుడి కలెక్టరు కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇది హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 13 మంది మృతిచెందారు. ఆందోళనల దృష్ట్యా పరిశ్రమలో ఉత్పత్తిని నిలిపివేయాలని తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. ప్లాంట్‌ లైసెన్స్‌ను పునరుద్ధరించేంత వరకూ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి పరిశ్రమలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి దృష్టికొచ్చింది. దీంతో స్పందించిన మండలి.. ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. మరోవైపు ఆందోళనల నేపథ్యంలో ట్యుటికోరిన్‌లో ఇంటర్నెట్‌ సేవలను ఐదు రోజుల వరకు నిలిపివేశారు. ట్యుటికోరిన్‌తో పాటు తిరునెల్వేలి, కన్యాకుమారిలోనూ అంతర్జాల సేవలు పనిచేయవని అధికారులు స్పష్టం చేశారు. సోషల్‌విూడియా ద్వారా ఎలాంటి వదంతులు వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తిరిగి మే 27న సేవలను పునరుద్ధరిస్తామన్నారు. ఇదిలా ఉంటే తూత్తుకుడిలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా శుక్రవారం డీఎంకే నేతలు బంద్‌కు పిలుపునిచ్చారు.
సచివాలయం ఎదుట డీఎంకే అందోళన ..
తూత్తుకుడిలో జరిగిన ఘటనపై సీఎం పళనిస్వామిని కలిసేందుకు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సచివాలయానికి వెళ్లారు. ఎటువంటి ముందస్తు అనుమతి కానీ, సమాచారం లేకుండా స్టాలిన్‌ సచివాలయానికి రావడంతో సీఎంవో కార్యాలయం సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో స్టాలిన్‌ సిబ్బంది తీరుపై మండిపడ్డారు. సీఎంను కలిసేందుకు వచ్చానని చెప్పినప్పటికీ ముందస్తు అనుమతి లేకుండా కలవడం కుదరదని సీఎంవో సిబ్బంది ఖరాఖండీగా చెప్పారు. దీంతో అక్కడే ఉన్న డీఎంకే కార్యకర్తలతో కలిసి స్టాలిన్‌ సచివాలయం కార్యాలయం వద్ద రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎంతచెప్పినప్పటికీ డీఎంకే కార్యకర్తలు ఆందోళనను విరమింపచేయకపోవటంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళని స్వామి రాజీనామా చేయాలని, డీజీపీని తక్షణమే సస్పెండ్‌ చేయాలని స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.