అడవులకు రక్షణగా పోడు రైతులు నిలవాలి
ఉద్యాన పంటలతో లాభాలు గడించాలి: కోరం
ఖమ్మం,ఫిబ్రవరి9(జనంసాక్షి): ఇక నుంచి ఏజెన్సీ రైతులెవరూ అడవిని నరకొద్దని, సంరక్షణకు తమవంతు సహకారం అందించాలని మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య సూచించారు. పోడు భూములలో ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. దీని వలన ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు రైతులు కూడా అధిక లాభాలు గడించొచ్చని చెప్పారు. ప్రస్తుతం నిరంతర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున బోర్లు వేసుకొని ఉద్యాన పంటల సాగు ప్రారంభించాలని చెప్పారు. రైతు బీమా పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు తమ దరఖాస్తును ఆన్‌లైన్ చేయించుకోవాలన్నారు. ఇప్పటికే అడవులు నాశనం అయ్యాయని అంటూ, ఇకనుంచి అడవుల రక్షణ ఉద్యమంగా సాగాలన్నారు. భవిష్యత్‌లో అర్హులైన పోడు రైతులకు అటవీశాఖ అధికారుల నుంచి వేదింపులు ఉండబోవన్నారు. అటవీ సంరక్షణలో ఇప్పటి వరకు ఉన్న పోడు రైతులు అధికారులకు సహకరించాలన్నారు. వారే అడవులకు రోణగా నిలవాలన్నారు. కొత్తా పోడు చేయాలనుకుంటే చర్యలు తప్పవన్నారు. పోడు భూములకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావని, గిరిజన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పోడు రైతులకు న్యాయం చేస్తూ హరితహారాన్ని ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు హావిూ ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం కొందరు అటవీశాఖ అధికారులు ఏజెన్సీ గ్రామాలలో పర్యటిస్తూ గిరిజనులను భయాందోళనలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అడవుల్లో అక్రమాలకు పాల్పడిన అధికారులను సీఎం కేసీఆర్ బదిలీ చేయడంతోపాటు చర్యలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం మృతిచెందిన కొందరు రైతులు రైతుబీమా పథకంలో భాగంగా ఆన్‌లైన్ చేయించుకోకపోవడంతో బీమా సహాయాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. భవిష్యత్‌లో ఏ రైతుకు అటువంటి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.