అడవుల రక్షణకు కఠినచర్యలు
ప్రభుత్వానికి అందరూ సహకరించాలి
సామిల్, కార్పెంటర్లకు అవగాహన
వరంగల్,ఫిబ్రవరి14(జనంసాక్షి): ప్రభుత్వం అటవీ సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటుందని వరంగల్ రూరల్ జిల్లా అటవీశాఖ అధికారి పురుషోత్తం అన్నారు. అటవీ భూమి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ ఆదేశానుసారం పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో అధికారుల సవిూక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిబంధనలను, పర్యావరణ పరిరక్షణను అమలు చేసేందుకు డివిజన్ స్థాయిలో కూడా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడవుల రక్షణ అందరి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని అన్నారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖలతో సామిల్లు యజమానులకు, వండ్రంగి కార్మికులకు, ఫర్నిచర్ దుకాణాల యజమానులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అడవిలోని చెట్లు, వనమూలికలు, జంతువులు, పక్షులను కాపాడేందుకు పలు కీలక నిర్ణయాలను ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుందన్నారు. సామిల్లు యజమానులకు, కార్పెంటర్లు, దూగడ పరికర యజమానులకు, ఫర్నిచర్ దుకాణదారులకు ముందుగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రెవెన్యూ అధికారుల సహకారంతో పోడు భూములను స్వాధీనం చేసుకుంటామని, పోలీసు అధికారుల సహాయంతో ట్రెంచ్ పనులు చేస్తామన్నారు. సామిల్లు యజమానులు తప్పనిసరిగా రెండు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అటవీ భూములను నరికేసినా, కలప స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని తెలిపారు.