అణ్వాయుధరహిత ప్రపంచం కావాలి
– హిరోషిమా మృతులకు ఒబామా నివాళి
హిరోషిమా,మే27(జనంసాక్షి): అణ్వాయుధాలు లేని ప్రపంచం కోసం కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. రెండో ప్రపంచయుద్దంలో కకావికలమైన హిరోషిమాను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన హిరోషిమా స్మారక స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. రెండో ప్రపంచయుద్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు హిరోషిమాను సందర్శించడం ఇదే మొదటిసారి. జపాన్ ప్రధాని షింజో అబే కూడా నివాళి అర్పించారు. 1945 ఆగస్టు ఆరో తేదిన అణుదాడి వల్ల హిరోషిమాలో లక్షా నలబై వేల మంది మృతి చెందారు.
హిరోషిమా మృతులకు ఒబామా నివాళులు
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణుబాంబు దాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. మృతుల స్మారక స్థూపం దగ్గర పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాక్షించారు. జపాన్ ప్రధాని షింజో అబే కూడా ఒబామాతో పాటు నివాళులు అర్పించారు.1945, ఆగస్ట్ 6న హిరోషిమా నగరంపై అమెరికా అణుబాంబుని ప్రయోగించింది. ఈ దాడిలో లక్షా నలబై వేల మంది చనిపోయారు. లక్షల మంది గాయపడ్డారు. అణుధార్మిక ప్రభావం ఇప్పటికీ జపాన్ వాసులను వెంటాడుతోంది. రకరకాల రుగ్మతలతో పిల్లలు పుడుతున్నారు. ఆ దాడి జరిగిన తర్వాత అంటే.. దాదాపు 71 సంవత్సరాల తర్వాత హిరోషిమాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడిగా ఒబామా రికార్డులకెక్కారు. ఈ పర్యటనలో అమెరికా తరఫున జపాన్ కు ఒబామా క్షమాపణలు చెబుతారని ప్రచారం జరిగింది. ఐతే, ఆయన ఆ మాట మాత్రం చెప్పలేదు. ఉద్వేగంగా మాట్లాడారు. నిరంతర ప్రయత్నం వల్ల చేదు జ్ఞాపకాలను మరిచిపోవచ్చని ఒబామా అన్నారు. మనది మానవ జాతి. మళ్లీ మనం ఒకటి కావచ్చు. మనం నేర్చుకోవచ్చు. మన ఇష్టాన్ని ఎన్నుకోవచ్చు. మన పిల్లలకు భిన్నమైన కథలను చెప్పుకోవచ్చు. క్రూరత్వం లేని సమాజాన్ని సృష్టించవచ్చన్నారు. బాంబు దాడిలో మరణించినవాళ్లు మనలాంటివాళ్లేనని కొందరు అనుకుంటారు. యుద్ధం అవసరం లేదన్న ఆలోచనలో వాళ్లు ఉంటారు. సైన్సు అభివృద్ధి వల్ల జీవితాలు మరింత మెరుగుపడాలని భావిస్తారు. శాంతి ఎంతో విలువైందన్నారు.హిరోషిమాలో ఒబామా పర్యటించడం చరిత్రాత్మకమని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. ప్రపంచ ప్రజలు అణ్వస్త్ర రహిత సమాజాన్ని కోరుకుంటున్నారన్నారు.