అత్యధిక మందికి ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

ప్రపంచంలోనే మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం
…రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి
శ్రీరంగాపురం, సెపెటంబర్ 09 : (జనంసాక్షి)
దేశంలో అత్యధిక మందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా ప్రపంచంలోనే మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నిరంజన్రెడ్డి శ్రీరంగాపూర్ మండలంలో పర్యటించారు. మండలకేంద్రంలోని రంగ సముద్రం జలాశయంలో చేపపిల్లలను విడుదల చేసి, ఆసరా ఫించను లబ్ధిదారులకు గుర్తింపుకార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఇచ్చిన మాట ప్రకారం మరో పది లక్షల మందికి ఫించన్లు వచ్చాయని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి ఫించన్లు వస్తున్నాయని చెప్పారు. ఫించన్లు రాని వారికి త్వరలోనే మళ్లీ ఫించన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధి లభించిందని, వాటి పెంపకం ద్వారా భవిష్యత్ తరాలకు బలవర్దక ఆహారం అందుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపునకు ఇది నిదర్శనమని విశ్వసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక్కో పథకం ద్వారా ఒక్కో రకమైన సామాజిక, ఆర్థిక ప్రయోజనం నెరవేరుతున్నదన్నారు. నీళ్లు ఇవ్వడం మూలంగా వ్యవసాయ రంగం, చేప పిల్లలు, గొర్లు, మేకల వంటి సకల జీవరాశులకు మేలు జరగడమే కాకుండా భూగర్భజలాలు పెరిగాయని చెప్పారు. ప్రపంచ పర్యావరణ నిపుణులు చెప్పేదానికంటే ముందే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆచరిస్తున్నదని గుర్తు చేశారు. కరోనా విజృంభణతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా.. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, అభివృద్ధి పనులను ఆపలేదన్నారు. ఇంత మంది పేదలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మీరు అభిమానంతో ఓట్లేసి గెలిపిస్తే కేసీఆర్ ఆశీర్వదించి వ్యవసాయ మంత్రిని చేసి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎంపీపీ గాయత్రి, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు బుచ్చారెడ్డి, కోదండరామిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జగన్నాథ నాయుడు, గౌడ నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.