అత్యాచారాలకు పాల్పడే మానవమృగాలకు న్యాయ సహాయం అందించొద్దు
మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి
హైదరాబాద్, జనవరి 8 (జనంసాక్షి):
సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడే మానవ మృగాలకు ఎవరూ సహకరించవద్దని ఆయన పిలుపునిచ్చారు. ‘మహిళలపై జరుగుతున్న లైంగిక హింస-సమస్య మూలాలు-పరిష్కారాలు’ అంశంపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర జ్యుడీషియల్ అకాడవిూ మంగళవారం మేథోమధన సదస్సు నిర్వహించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, లా కమిషన్ మాజీ సభ్యుడు వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ రోహిణి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. సదస్సును ప్రారంభించిన మాజీ న్యాయమూర్తి వెంకటరామరెడ్డి అనంతరం ప్రసంగిస్తూ.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు అవసరమైన చట్టాలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని సూచించారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొనేలా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అఘాయిత్యాలకు పాల్పడిన మానవ మృగాలకు ఎవ్వరూ మద్దతు ఇవ్వవద్దని సూచించారు. అత్యాచార కేసు విచారణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని.. బాధితులకు పూర్తి రక్షణ, వైద్యం అందేలా చూడాలని ఆయన కోరారు. అత్యాచార ఘటనలపై పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. మహిళల రక్షణకు మరిన్ని కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు కూడా సమర్థవంతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత అటు న్యాయ వ్యవస్థతో ఇటు ప్రభుత్వంపైనా ఉందన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి చట్టాలతో పాటు వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వేధింపులకు పాల్పడుతున్న వారికి గరిష్ట శిక్షలు అమలయ్యేలా చూస్తే.. దానివల్ల ఇతరుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.