అదనంగా నీటి విడుదలతో ఆదుకోవాలి

కడప,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): గత 4,5 ఏళ్లుగా సాగునీరు అందకపోవడంతో పండ్ల తోటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎంపి మిధున్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నీరు విడుదల చేయకుండా ఇలానే కొనసాగితే తాగునీరు, సాగునీటితో ఈ ప్రాంత ప్రజలు అలమటిస్తారని అన్నారు. దీనిపై మంత్రి దేవినేని ఉమ తగు నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పీబీఆర్‌కు అదనపు టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కడప, అనంతపురం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాల కోసం పీబీఆర్‌కు అదనంగా నీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏటా నీటి విడుదల విషయంలో  అన్యాయం జరుగుతుందని అన్నారు. అదనపు నీటిని విడుదల చేసి పులివెందుల పురప్రజల దాహార్తి తీర్చే నక్కలప్లలె సమ్మర్‌స్టోరేజి ట్యాంకును నీటితో నింపాలన్నారు. పీబీసీ ఆయకట్టు పరిధిలో 60వేల ఎకరాలు ఉన్నప్పటికి సాగునీరు ఏ మాత్రం అందలేదని అన్నారు.  గండికోట, గాలేరి నగరి సుజల స్రవంతి జలాశయాలు పూర్తి చేయాలన్నారు.