అదిలాబాద్‌ పట్టణంలో కార్డెన్‌ సెర్చ్‌ 

– పత్రాలులేని బైక్‌లు, ఆటోలు సీజ్‌ 
– అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారమివ్వండి
– ప్రజలకు సూచించిన ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌
ఆదిలాబాద్‌,జ‌నం సాక్షి ) : ఆదిలాబాద్‌ పట్టణం మావల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పిట్టల వాడ కాలనిలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆధ్వర్యంలో కార్డెన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రతి గల్లీలో ఇంటిని తనిఖీ చేశారు. ఎటువంటి పత్రాలు లేని 41 ద్విచక్రవాహనాలు, 10 ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఒక బెల్ట్‌ షాపును మూసివేయించి అందులో ఉన్న 35 మందు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు సురక్షితమైన భద్రత కల్పించడానికి వీధి ప్రజలే పోలీసులకు ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రోత్సహిస్తున్నారని ఎస్పీ  వెల్లడించారు. జిల్లాలోని ప్రతి పట్టణం, గ్రామంలో ఈ తనిఖీలు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. వీధుల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. వేసవిలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుందని, శుభాకార్యాల దృష్ట్యా ఇంటిని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లే కుటుంబాలు ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
——————————