ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా
అతిశీతో గవర్నర్ వీకే సక్సేనా సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి అతిశీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈమేరకు ఆదివారం ఉదయం రాజ్ భవన్ కు వెళ్లిన అతిశీ.. గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అతిశీతో సక్సేనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణం యమునా నది శాపమేనని వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనిపై గతంలోనే కేజ్రీవాల్ ను కూడా హెచ్చరించానని, అయితే, ఆయన పట్టించుకోలేదని గవర్నర్ అన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వ్యాఖ్యలకు అతిశీ స్పందించలేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ విషయంపై స్పందించేందుకు గవర్నర్ సక్సేనా నిరాకరించారు.
శాసనసభ ఎన్నికల్లో దిల్లీలో ఆప్ ఓటమి వెనుక యమునా నదీజలాల వివాదం కూడా కీలకపాత్ర పోషించినట్లు కనిపిస్తోంది. యమునా నది కాలుష్యంపై ఆప్ చేసిన వాదన తమ సొంత రాష్ట్రంపై దాడి అని హరియాణా మూలాలున్న ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు దీనిని తేటతెల్లం చేస్తున్నాయి. హరియాణాకు చెందిన 14 మందిని భాజపా తమ అభ్యర్థులుగా నిలబెడితే వారిలో 12 మంది విజేతలుగా నిలిచారు. ఆప్ ఇలా 10 మందిని నిలబెడితే నలుగురే నెగ్గారు. ఓటర్లలో 10 శాతం కంటే ఎక్కువమంది హరియాణావాసులు ఉన్న 13 సీట్లలో 11 చోట్ల భాజపా నెగ్గింది. 2020 ఎన్నికలకు ఇది పూర్తి భిన్నం. 5% కంటే ఎక్కువమంది హరియాణా ఓటర్లున్న 13 స్థానాల్లో 12 చోట్ల కమలమే నెగ్గింది. ఆ రాష్ట్ర సరిహద్దు కలిగిఉన్న 11 సీట్లలో తొమ్మిదింటిని కమలనాథులే గెలుచుకున్నారు.
హామీని నిలబెట్టుకోని కేజ్రీవాల్
యమునా నది దిల్లీలో 52 కి.మీ. పొడవునా ప్రవహిస్తుంది. 15 నియోజకవర్గాల మీదుగా వెళ్లే ఈ నది చాలాకాలం నుంచి పర్యావరణపరంగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ నదిని ప్రక్షాళన చేస్తానని ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ 2020లోనే హామీ ఇచ్చారు. దీనిని నిలబెట్టుకోకపోవడంపై ఎన్నికల ప్రచారంలో భాజపా నిలదీసింది. దీంతో కేజ్రీవాల్ మండిపడి దిల్లీ ప్రజలకు హాని తలపెట్టేందుకు భాజపా పాలిత హరియాణా ప్రభుత్వం ఈ నదీజలాలను విషపూరితం చేస్తోందని ఆరోపించారు. వెంటనే భాజపా దీనినొక భావోద్వేగ అంశంగా మలచింది. కేజ్రీ మాటలు హరియాణాకు, భారతీయులకు అవమానకరమని ప్రధాని మోదీ కూడా ఆక్షేపించారు. ఆ తర్వాత ఆప్ వివరణ ఇచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. యమునపై కేజ్రీవాల్ అలా మాట్లాడకపోయిఉంటే ఆ పార్టీకి కనీసం 5 నుంచి 7 సీట్లు ఎక్కువగా వచ్చేవని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ చెప్పారు. దిల్లీ ప్రజల్లో 40% పైగా హరియాణావారే ఉన్నారని గుర్తుచేశారు.