హమాస్, గాజాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
గాజాలోకి అమెరికా బలగాలను దింపుతామని వ్యాఖ్య
ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాలో హమాస్ లేకుండా చేస్తామని… గాజాను స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను పలు దేశాలు ఖండించాయి.
తాజాగా ట్రంప్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. గాజాను స్వాధీనం చేసుకుంటామని ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అన్నారు. గాజాలోకి హమాస్ మళ్లీ అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు.
గాజాలో ఉన్న పాలస్తీనియన్లను తొలుత మరో ప్రాంతానికి తరలిస్తామని… అనంతరం గాజాలోకి అమెరికా బలగాలను దింపి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపడతామని ట్రంప్ చెప్పారు. గాజాలో పాలస్తీనియన్ల కోసం మంచి ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. గాజాను స్వాధీనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.