అధికారంలోకి రాగానే.. ప్రైవేట్ విద్యాసంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీచేస్తాం
– సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల
– ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు రూ.5లక్షల బీమా
– ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : ప్రజాకూటమి అధికారంలోకి రాగానే ప్రైవేట్ విద్యాసంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీచేస్తామని, వారికి అన్ని విధాల అండగా ఉంటామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. గురువారం శంషాబాద్‌లో క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కేజీ నుంచి పీజీ విద్యాసంస్థల ఐకాస సదస్సులో ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులతో రాహుల్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ విద్యాసంస్థలపై కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరించారని, కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని హావిూ ఇచ్చారు. సకాలంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని, విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.
చిన్న విద్యా సంస్థలను తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు. యువతకు బోధనా రుసుములను సక్రమంగా చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని హావిూ ఇచ్చారని, దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పాడని, ఇలా ఎన్నో హావిూలు ఇచ్చినా ఏ ఒక్కటి అమలు కాలేదని రాహుల్ మండిపడ్డారు. రాఫెల్ విషయంలో అనిల్ అంబానీకి రూ. 30కోట్లు లబ్ధిచేకూర్చేలా చేశారని విమర్శించారు. తెలంగాణను సమగ్రాభివృద్ధి చేయాలని కేసీఆర్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకోలేదని రాహుల్ అన్నారు. పంజాబ్, కర్ణాకటల్లో రైతులకు మేం రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణలోనూ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ హావిూ ఇచ్చారు. 2కోట్లు ఉద్యోగాలు, ప్రతీ అకౌంట్‌లో రూ. 15లక్షలు వేస్తామన్న హావిూలు మేం ఇవ్వమని, ప్రణాళిక ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్న ప్రైవేట్ విద్యా సంస్థలకు రాహుల్ అభినందనలు తెలిపారు. రైతురుణాలపై నేను అనేక సార్లు మాట్లాడానని, ధనికులైన వ్యాపారులకు కేంద్ర సర్కారు రుణమాఫీ చేస్తోందని, పేద రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంలాగే తెలంగాణలోని కేసీఆర్ సర్కారు కూడా వ్యవహరిస్తోందని రాహుల్ అన్నారు.
రెండు దఫాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ – టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా ఉంటామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హావిూ ఇచ్చారు. పౌల్టీఫ్రాంలో కాలేజీలు నడిపిస్తున్నారంటూ కేసీఆర్ ప్రైవేట్ విద్యాసంస్థలను అవమానించారని మండిపడ్డారు. విద్యాసంస్థల్లో పోలీసులతో దాడులు చేయించారన్నారు. కేసీఆర్ కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాశారని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వస్తే ప్రైవేట్ విద్యాసంస్థలకు అండగా ఉంటామని హావిూఇచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజా కూటమి అధికారంలోకి రాగానే రెండు విడతల్లో ఫీజురీఎంబర్స్‌మెంట్ విడుదల చేస్తామని ఉత్తమ్ హావిూ ఇచ్చారు. విద్యుత్ బిల్లులు, ట్యాక్స్‌లు భారం
కాకుండా చూస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. ఐదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు నరకం చూపించారని విమర్శించారు. విద్యా ప్రమాణాల పేరిట విద్యా సంస్థలపెంపుకు కాకుండా మూసివేతకు పనిచేశారన్నారు. పోలీసులతో సోదాలు చేయించి మరీ విద్యా సంస్థలను మూసివేశారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు సకాలంలో చెల్లించటం లేదని అన్నారు. పనిచేసే ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని అన్నారు. తెరాసకు శిక్ష విధించాల్సిన సమయం ఆసన్నమైందని, డిసెంబర్7న విూరంతా ఓటు వేసి శిక్ష విధించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.