అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ రాజకీయాలు

న్యూఢిల్లీ,మే21(జ‌నం సాక్షి): నీతి,నిజాయితీ రాజకీయల గురించి తెగ మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ఎన్నికలకు సంబంధించిన అన్ని విలువలను  కాంగ్రెస్‌ హయాంలోనే తుంగలో తొక్కింది. గతంలో వ్యవస్థలను దుర్వినియోగం చేసింది. అందుకు ఎన్నో  ఉదాహరణలు ఉన్నాయి. అధికారంలో ఉంటే ఒకలా..లేకుంటే మరోలా వ్యవహరించడం దానికి అలవాటే.  పార్టీలో పనిచేసిన వారికికాక కుల, ధనబలం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీయే ప్రారంభించింది. ఇక ఎన్నికల సమయంలో వందల కోట్లు ప్రవహించడం, డబ్బు, మద్యం పంపిణీ చేయడం మామూలయి పోయింది. రాష్ట్రాల ఇన్‌ఛార్జీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కూడా కాంగ్రెస్‌ సంస్కృతిలో భాగం. కాంగ్రెస్‌ మొహం చూడని వారు కూడా టిక్కెట్లు దక్కించుకుని పెత్తనం చెలాయించిన రోజులు ఉన్నాయి.  దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ బలహీనంగా ఉండడమే భారతీయ జనతా పార్టీకి ప్రయోజనం చేకూర్చింది. యడ్యూరప్పకు మోదీ, అమిత్‌ షాలు వ్యూహాత్మకంగా ఉన్నంతగా  రాహుల్‌ గాంధీ ఉండడం లేదు. కాంగ్రెస్‌ వృద్ధనేతలు ఓటర్లను ఆకర్షించే సత్తా కోల్పోయారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహాలు జనానికి పాతబడిపోయాయి. అందుకే ప్రాంతీయ పార్టీల దన్నుతో మళ్లీ బలం పుంజుకున అవకాశానలు కాంగ్రెస్‌ గట్టిగా మొదలు పెట్టింది.
ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ చేసిన మంచి పనులు, లేదా చెడ్డ పనుల ఆధారంగా ఆ పార్టీని తిరిగి ఎన్నుకోవాలన్న ధ్యాసలో ప్రజలు ఉండడం లేదు. ప్రజలను వ్యూహాత్మకంగా లోబర్చుకునే వారే అంతిమంగా విజయం సాదిస్తున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకత, అనుకూలతల ఆధారంగా ఫలితాలు నిర్ణయించే కాలమూ పోయింది. ఒకప్పుడు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్వహించిన పాత్రే బీజేపీ  నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా అవినీతిని నిర్మూలిస్తామన్న నినాదంతో జనాన్ని ఆకర్షించిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యింది.  అలాగే కాంగ్రెస్‌ తాను కోల్పోయిన విశ్వసనీయత ఇంకా సంపాదించుకోలేదు.  ఇంతవరకూ ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్‌ పార్టీని విజయపథంలోకి నడిపించినట్లుగా రుజువు చేసుకోలేని రాహుల్‌గాంధీ తాను 2019లో ప్రధానమంత్రినవుతానని ప్రకటించి తనకుతాను  ప్రజల ముందు అభాసు పాలయ్యారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని కోల్పోవడం చూస్తే రాహుల్‌ ప్రభావం ఏపాటిదో ఇట్టే చెప్పవచ్చు.  కర్నాటక ఎన్నికలకు ముందు ఢిల్లీ ర్యాలీలో ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్‌ గాంధీ అన్నా అది సాధ్యం కాదని కర్నాటకలో రుజువయ్యింది.  ఒకవైపు ప్రాంతీయ పార్టీ అధినేతలు కొందరు యూపీఏకు రాహుల్‌ గాంధీ సారథ్యం వహిస్తే తాము అందులో చేరలేమని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెసేతర ఫ్రంట్‌ కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నారు.  గతంలో బలమైన కాంగ్రెస్‌ పార్టీని ఓడించడానికి రకరకాల పార్టీలు చేతులు కలిపాయి. ఇప్పుడు బలమైన బీజేపీని ఓడించడానికి రకరకాల శక్తులు చేతులు కలపబోతున్నాయి. అధికారంలో లేకపోతే కాంగ్రెస్‌ నేతల్లో అసహనం పెరుగుతుంది. దేశ ప్రయోజనాలను కాపాడేంత విశాల హృదయం కాంగ్రెస్‌ నేతలకు ఉండదు. అయినా నీతినిజాయితీ గురించి మాట్లాడడం ద్వారా ప్రజలనె మోసం చేయాలని చూస్తుంటారు.