అధికారులు దొరికేది ఎప్పుడు.. హద్దులు చూపేది ఎప్పుడు..!
తేలని హద్దులు_ రైతులకు తీరని వ్యథలు.తేలని హద్దులు_ రైతులకు తీరని వ్యథలు.
ప్రభుత్వ భూముల కొలతలకే పరిమితమైన సర్వే అధికారులు.
ఎఫ్ లైన్ పిటిషన్ల పెండింగ్ తో ఇబ్బందుల్లో రైతులు.
సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ ప్రదక్షణలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 08.. (జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవసరాల కోసం వ్యవసాయ భూములను విక్రయించాలనుకునే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. హద్దులు చూపాలంటే ల్యాండ్స్ సర్వే అధికారులకు దరఖాస్తు లు చేసుకుని సంవత్సరం పైగా గడుస్తున్నా అధికారులు స్పందించి పరిస్థితి లేకపోవడంతో రైతులు ఇబ్బందులు వర్ణనాతీతం. ఉన్న అరకొర అధికారులు సిబ్బంది ప్రభుత్వ భూముల కొలతలకే పరిమితం కావడంతో ఎఫ్ లైట్ పిటిషన్లు పెండింగ్లో ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగిన పనులు జరగడం లేదంటూ వాపోతున్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోనీ చంద్రంపేటలో నివాసం ఉంటున్న రైతు అబ్బ గోని జంపయ్యకు కొంత వ్యవసాయ భూమి ఉంది. తన కూతురు వివాహం కోసం ఆ భూమిలో నుంచి కొంత భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. భూమికి సంబంధించి కొంత వివాదం ఉండడంతో హద్దులు చూపించాలంటూ సర్వే అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. పాపం జంపయ్యను దురదృష్టం వెంటాడుతున్నట్లే ఉంది. అప్పటినుంచి అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు ఏడాదికాలంగా ఎటు చేయలేకపోవడంతో దిక్కువిక్కుమంటున్నాడు. మొదట్లో జిల్లాలో ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి సర్వేలు చేస్తున్నామని అధికారులు చెబుతూ వచ్చారని ఇప్పుడేమో పోడు భూముల సర్వే కోసం వెళుతున్నామని దాటవేస్తున్నారంటూ జంపయ్య తెలిపారు. ఎప్పుడు ఏదో ఒక పేరుతో దరఖాస్తులు పెండింగ్లో పెట్టడం వల్ల ఒక్క జంపయ్య మాత్రమే కాదు సుమారు జిల్లాలో ఇప్పటికే వెయ్యి మంది పైగా రైతులు ఇట్లాంటి ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు.
రైతుల వ్యతలు వర్ణానాతీతం..
జిల్లాలోని 13 మండలాల్లో అనేకమంది రైతులు హద్దుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఇతర అవసరాల కోసం భూమిని విక్రయించాలనుకుని భూమి హద్దుల సమస్యల పరిష్కారం కోసం ఎఫ్ లైన్ దరఖాస్తులు చేసుకొని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి హద్దుల వివాదాలను పరిష్కరించాలంటూ వేడుకుంటున్న స్పందన కరువైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల సమస్యలు తీరేది ఎప్పుడో…
ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి. మండలానికి ఒక సర్వేరు చొప్పున ఉండాల్సి ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. వీరే అన్ని మండలాల సమస్యలను చూడాల్సి వస్తోంది. రెండు డివిజన్లో ఒకడిఐ పర్మినెంట్ ఉండగా వేములవాడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం భూ సేకరణ తోపాటు ఇటీవల పోడు భూముల సర్వే కోసం సర్వే డిపార్ట్మెంట్ అధికారులు సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తుండం తో ఎఫ్ లైన్ దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను చూసేవారే కరువయ్యారు. హద్దుల వివాదాలు తొలగించుకునీ సమస్యలను పరిష్కరించుకోవాలని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
టెక్నాలజీ ఉపయోగిస్తే పరిష్కారం సులువు అవుతుంది….
ప్రస్తుతం అంది వచ్చిన టెక్నాలజీని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. సర్వే విభాగంలో కూడా ఇటీవల డీజీ పీఎస్ మిషన్ అందుబాటులోకి వచ్చింది. మండలానికి ఒక డిజిపిఎస్ మిషన్ అందుబాటులో ఉంటే ఒకే రోజు 100 ఎకరాల పైగా భూములకు కొలతలు వేయొచ్చు. ప్రతి మండలానికి ఒక మిషన్ చొప్పున ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తే ఇటు అధికారులపై ఒత్తిడి తగ్గడంతో పాటు రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ల్యాండ్ సర్వే డిపార్ట్మెంటులో ఒక్క మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. 20 లక్షల ఖరీదు చేసే ఈ మిషన్ ను ప్రతి మండలంలో అందుబాటులో ఉంచాల్సి ఉంది. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయి అసహనం సతమతమవుతున్న రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా చూడాల్సి ఉంది. ఇప్పటికైనా అధికారులు దయతలిచి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి తమ కష్టాలను తొలగించాలని రైతులు కోరుతున్నారు.