అధికారుల బదిలీ

` ఈసీకి ప్యానల్‌ జాబితా పంపిన సీఎస్‌
` ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియామకం
` కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
` జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌
` హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):పలువురు కలెక్టర్లు, కమిషనర్లను బదిలీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు అధికారుల బదిలీ, ఆ స్థానాల్లో ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారుల చొప్పున ప్యానెల్‌ జాబితాను ఈసీకి పంపింది.మొత్తం నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీలతోపాటు రవాణా, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖల కార్యదర్శులు, కమిషనర్ల పోస్టులకు సంబంధించి సీఎస్‌ శాంతికుమారి ప్యానెల్‌ జాబితాను పంపారు. ఈ ప్యానెల్‌ నుంచి ఒక్కొక్కరిని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేయనుంది.
జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌
అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్‌ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు. శానిటేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్‌ ఉపేందర్‌ రెడ్డి పవర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్‌ శ్రీధర్‌ ఈవీఎం, వీవీ ప్యాట్‌ మేనేజ్‌మెంట్‌ నోడల్‌ అధికారి, రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ ప్రసన్నకుమార్‌ ట్రాన్స్‌పోర్టు మేనేజ్‌మెంట్‌, జాయింట్‌ కమిషనర్‌ జయంత్‌రావు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, ఈవీడీఎం డైరెక్టర్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌రెడ్డి ఎంసీసీ నోడల్‌ అధికారిగా నియమించారు.పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ విక్రం సింగ్‌ మాన్‌ లా అండ్‌ ఆర్డర్‌, జిల్లా సెక్యూరిటీ ప్లాన్‌ నోడల్‌ అధికారిగా నియమించారు. ఖైరతాబద్‌ జోన్‌ ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వి. శరత్‌చంద్ర ఎక్సెపెండిచర్‌ మానిటరీ నోడల్‌ అధికారిగా నియమించారు. జీహెచ్‌ఎంసీ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ ఆలీ ముర్తుజా విూడియా, కమ్యూనికేషన్‌ నోడల్‌ అధికారిగా నియమించారు. అడిషనల్‌ కమిషనర్‌ ఎస్టేట్‌ గీతా రాధి ఐటీ రిలేటెడ్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు.డిప్యూటీ కలెక్టర్లు పద్మప్రియ, అర్చన, శ్రీకాంత్‌ రిపోర్ట్‌ అండ్‌ రిటైన్స్‌ నోడల్‌ ఆఫీసర్లుగా నియమించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ చీఫ్‌ ఇంజినీర్‌ ఆర్‌ సత్యనారాయణ రెడ్డి బేసిక్‌ మినిమమ్‌ ఫెసిలిటీస్‌ నోడల్‌ అధికారిగా, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మజ హెల్త్‌ కేర్‌ ఆఫ్‌ పోలింగ్‌ పార్టీ అండ్‌ ఎలక్టర్స్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు.పర్సనల్‌ ఆఫీసర్‌ ఎస్‌డబ్ల్యూఎస్‌ విజయభాస్కర్‌ రెడ్డి బ్యాలెట్‌ పేపర్‌ నోడల్‌ అధికారిగా, జాయింట్‌ కమిషనర్‌ అలివేలు మంగతాయరు, ఎలక్ట్రోరోల్స్‌ నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు. స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ భాషా ఫిర్యాదులు, పరిష్కారం విభాగానికి నోడల్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌
హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఇన్‌చార్జి పోలీస్‌ కమిషనర్‌గా విక్రమ్‌సింగ్‌ మాన్‌ నియమితులయ్యారు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్‌ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్‌ బదిలీ చేసింది. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు. వీరి స్థానంలో కొత్తవారిని నియమించాలని, రి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బదిలీ అయినవారి స్థానంలో ఇన్‌చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీ కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. హైదరాబాద్‌ సీపీగా విక్రమ్‌సింగ్‌ మాన్‌, వరంగల్‌ సీపీగా డీ.మురళీధర్‌, నిజామాబాద్‌ సీపీగా ఎస్‌.జయరాంను నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం.నాగేశ్వర్‌రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ.అశోక్‌, కామారెడ్డి ఎస్పీగా కే.నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్‌.ప్రభాకర్‌రావు, మహబూబ్‌నగర్‌ ఎస్పీగా అందెరాములు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీగా సీహెచ్‌.రామేశ్వర్‌, గద్వాల ఎస్పీగా ఎన్‌ వి, మహబూబాబాద్‌ ఎస్పీగా జే.చెన్నయ్య, నారాయణ్‌పేట ఎస్పీగా కే.సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ.రాములును నియమించారు.  తెలంగాణలో 20 మంది అధికారుల బదిలీ తెలంగాణలో మొత్తం 20 మంది అధికారులను ట్రాన్స్‌ఫర్‌ చేస్తూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారిలో 13 మంది పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ అలీ, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ శ్రీదేవి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితోపాటు హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, రంగనాథ సత్యనారాయణ.. సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, గద్వాల్‌, మహబూబాబాద్‌, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌, కే నర్సింహ, మనోహర్‌, సృజన, చంద్రమోహన్‌, కరుణాకర్‌, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్‌ను బదిలీ చేసింది.