అధికారుల సమన్వయంతో హరితహారం
రంగారెడ్డి,జూలై9(జనం సాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రభుత్వశాఖలను సమన్వయం చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడటంతో కచ్చితంగా లక్ష్యం సాధించాలని నిర్ణయించారు. మొత్తం ప్రభుత్వ శాఖలు, కార్పొరేట్ సంస్థలు, విద్యాసంస్థలు, స్వచ్చందసంస్థలను భాగస్వాములను చేసి ఖాళీ స్థలమున్న ప్రతిచోటా మొక్కలు నాటేలా చూడాలని భావిస్తున్నారు. జిల్లా పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటేందుకు సన్నధ్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా మొక్కలు ఎక్కడెక్కడ నాటాలన్నది గుర్తించారు. ఇందులో కూడా నిర్ధిష్టంగా మొక్కలు నాటేందుకు స్థలాల ఎంపిక కూడా పూర్తిచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పొలంగట్లు, పొలాలు, చెరువుగట్లు, రహదారుల పక్క ఖాళీ స్థలాలు, విద్యాసంస్థలు ఇలా అన్ని ప్రాంతాల పరిధిలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతారు. ఇందుకోసం ముందు గుంటలు తవ్వించడంతోపాటు సకాలంలో మొక్కలను కూడా పంపిణీ చేస్తారు. అలాగే ప్రతి ప్రభుత్వ శాఖకూ లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లాలో హరితహారం కింద నాటినప్రతి మొక్క బతికేలా సైట్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డా.ఎం.వి.రెడ్డి పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో హరితహారం కార్యక్రమాన్ని అమలు పరచడంలో విఆర్వోలదే కీలకమైం దన్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.