అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన అవసరమేమొచ్చింది

– బాండ్లలో బ్రోకర్‌కు రూ.17కోట్లు ఇవ్వడమే బాబు చెబుతున్న పారదర్శకతా
– బాండ్లు కొన్న తొమ్మిది మంది పేర్లను బయటపెట్టాలి
– నాలుగేళ్లలో రూ.1.30లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి
– పెట్రోల్‌, మద్యంపై ఏ రాష్ట్రంలో లేనంతా ప్రభుత్వం పన్నులు వసూళ్లు చేస్తుంది
– రూ. 50 క్వార్టర్‌ బాటిల్‌లో రూ.37 దండుకుంటుంది
– విలేకరుల సమావేశంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌
రాజమండ్రి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : అమరావతి అభివృద్ధికోసం అధిక వడ్డీకి అప్పు తీసుకోవాల్సిన దైర్భాగ్యం ఏమొచ్చిందో చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్‌ ప్రశ్నించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి బాండ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు నెలలకు 10.36 శాతం అధిక వడ్డీ చెల్లించాలన్నారు. అమరావతి బాండ్లలో బ్రోకర్‌కు రూ.17 కోట్లు ఇవ్వడమే చంద్రబాబు చెబుతున్న పారదర్శకతా అని ఆయన ప్రశ్నించారు. బాండ్లు కొన్న 9మంది పేర్లు ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దంటూ ఏడు నెలల క్రితమే జీవో జారీ చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లలో తీసుకున్న రూ.1.30లక్షల కోట్ల అప్పును ప్రభుత్వం ఏం చేసిందని ఉండవల్లి నిలదీశారు. అప్పట్లో విజన్‌ 2020 రూపొందించిన చంద్రబాబు సలహాదారు పాస్కల్‌ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ జైలులో ఉన్నారని ఈ సందర్భంగా ఉండవల్లి తెలిపారు. మందుబాబులు ఓ వారం రోజులు స్టైక్ర్‌ చేస్తే ప్రభుత్వాలు అల్లాడిపోతాయని అన్నారు. రూ.8.50కి తయారయ్యే మద్యంను రూ.50కి అమ్ముతున్నారని, దీంట్లో 37 రూపాయలు ప్రభుత్వం దోచేస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై చాలా మంది తనని సంప్రదిస్తున్నారని, ఉద్యోగాలు వదులుకొని రాజకీయాల్లోకి వస్తామంటున్నారని పేర్కొన్నారు.

తాజావార్తలు