అధిష్టానంపై విశ్వాసముంది

ఒత్తిడి పెంచేందుకే సభ : జానా
హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు విషయంలో అధిష్టానంపై విశ్వాసముందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమంలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రబాగాన నిలిచామని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు అన్ని పార్టీలకంటే ముందునిలిచి పోరాడుతున్నారని మంత్రి జానారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం జానారెడ్డి తన నివాసంలో తెలంగాణ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం వస్తున్న ఊహాగానాలపై స్పందించలేమన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతిపాదనలు ముందుకు తెస్తే ఆలోచిస్తామన్నారు. ప్రతిపక్షాల్లాగానో, టీ జేఏసీలాగో వ్యవహరించడం తమకు చేతకాదన్నారు. తెలంగాణ కోసం పోరాటంలో కొన్ని సందర్భాల్లో పార్టీ గీతను కూడా దాటామన్నారు. ఇది కాంగ్రెస్‌ను ఎదిరించడం కానేకాదన్నారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు తాము చేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలోని నేతలంతా కూర్చుని ఐక్యంగా పోరాడాలని నిర్ణయించామన్నారు. చిట్టచివరిసారిగా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం తెలంగాణకు చెందిన నేతలంతా కూర్చుని తెలంగాణ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశామని, దీనిని అదిష్టానానికి పంపించనున్నామన్నారు. తాముచేసిన తీర్మాణనికి ప్రజల మద్దతు ఎలా ఉందో చూపించేందుకే ఈనెల 30న బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఒకటికి రెండుసార్లు రాజనామాలు కూడా చేశామన్నారు. ఏ పోరాటంలో కూడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల అభీష్టం మేరకే తామంతా ప్రయత్నించామన్నారు. సోనియాగాంధీపై విశ్వాసం ఉంది కాబట్టే తాము ప్రజలపక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నామన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనందున సీమాంధ్ర నేతలు సహకరించాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు  వారం రోజులుగా తాము అహర్నిషలు కృషి చేస్తున్నామన్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లా వారీగా నగరంలోకి రాగానే ర్యాలీలు నిర్వహించి బహిరంగ సభవద్దకు తరలిరావాలని జానారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ద్వారానే తెలంగాణ ఏర్పడిరదనే విశ్వాసాన్ని కూడా కల్పించాలన్నదే తమ అభిమతమన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోబోమని మంత్రి పేర్కొన్నారు. బహిరంగ సభకు తెలంగాణా జిల్లాలనుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈసభకు బొత్సను గాని, దిగ్విజయ్‌సింగ్‌ను కాని ఆహ్వానించలేదన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణా కాంగ్రెస్‌ సమావేశం మాత్రమేనన్నారు. గతంలో కూడా తాము ఉద్యమాలు చేసినప్పుడు వేరేనేతలను పిలిచిన దాఖలాలు లేవన్నారు. మీడియా సమావేశంలో సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌, కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, డెప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.