* అధైర్య పడద్దు అండగా ఉంటా

* పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ పంపిణీ

* బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి

కరీంనగర్ బ్యూరో( జనం సాక్షి) :
ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకునే విధంగా శక్తి వంచన లేకుండా కృషి పట్టుదల, విశ్వాసం ఉన్నప్పుడే విజయం దరి చేరుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ తెలిపారు. గత మూడు నెలలుగా కరీంనగర్లోని ఫిలిం భవన్లో ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ పోటీ పరీక్షల ఉచిత శిక్షణ శిబిరం శుక్రవారంతో ముగిసింది. శిక్షణ తరగతుల ముగింపు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమానికి బండి శుక్రవారం కరీంనగర్లోని ఫిలిం భవన్ కు హాజరై, శిక్షణ విద్యార్థులకు తగిన సూచనలు చేసి మాట్లాడారు. ముఖ్యంగా పార్లమెంట్ పరిధిలోని పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే విద్యార్థినీ విద్యార్థులకు తగిన ప్రోత్సాహం, తోడ్పాటును అందించాలనే ఆకాంక్షతో, నిష్ణాతులైన నిపుణులు అధ్యాపకుల ఆధ్వర్యంలో కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాలలో 90 రోజులు ఉచిత శిక్షణా తరగతులను విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఉద్యోగ లక్ష్యాన్ని చేరుకునే దిశలో విఫలమైనా అధైర్యపడవద్దని, అండగా ఉండి ఇతర ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ఉద్యోగ ప్రక్రియ త్వరితగతిన చేపట్టిన అనంతరం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. శిక్షణ తరగతులలో
నిష్ణాతులైన శిక్షకులు అందించిన విలువైన సూచనలను పరిగణలోకి తీసుకొని మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

* బండి సంజయ్ కి సన్మానం

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధమైన విద్యార్థినీ విద్యార్థుల కోసం కరీంనగర్, సిరిసిల్లలో ఎంపీ బండి సంజయ్ కుమార్ తీసుకున్న చొరవకు, ఉచిత శిక్షణ, భోజన వసతి ఏర్పాట్లపై విద్యార్థినిలు ఎంపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి సన్మానించారు. అలాగే, నిష్ణాతులైన శిక్షకులతో కోచింగ్ అందించి, మెటీరియల్ కూడా అందించినందుకు విద్యార్థిని విద్యార్థులు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం శిక్షకులకు కూడా విద్యార్థులు సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణా రెడ్డి, కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు