అనంత జిల్లాలో విషాద ఘటన


కొండపై నుంచి జారిపడి పూజారి మృతి
అనంతపురం,ఆగస్ట్‌21(జనంసాక్షి): జిల్లాలోని శింగనమల మండలం గంపమల్లయ్యస్వామి కొండపై శనివారం విషాదం చోటు చేసుకుంది. గంపమల్లయ్య కొండపై నుంచి జారిపడి పూజారి పాపయ్య మృతి చెందాడు. ఎత్తయిన కొండల మధ్య అడవిలో కొలువైన గంపమల్లయ్య స్వామివారికి పూజలు చేస్తుండగా
ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దాదాపు వంద అడుగుల పైనుంచి జారిపడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దేవునికి నిత్యం పూజ చేసే ఆ పూజారిని చివరికి ఆ పూజే బలిగొంది. అనంతపురం జిల్లాలోని శింగనమల సవిూపంలో గంపమల్లయ్య స్వామి కొండపై శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామివారికి పూజలు చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ సుమారు 40 అడుగుల కిందకు జారి పడి పూజారి పాపయ్య మృతిచెందారు. తిరుమల ఏడుకొండలకు మారు పేరుగా ఈ స్వామిని భక్తులు పూజిస్తూ ఉంటారు. ఏటా శ్రావణమాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో స్వామికి పూజలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ పాపయ్య అనే వ్యక్తి.. స్వామికి వంశపారంపర్యంగా పూజలు చేస్తూ ఉంటారు. శనివారం కూడా యథావిధిగా పూజ చేస్తున్నారు. ఈ క్రమంలో కొండ పైనుంచి గుహలోకి దిగే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి లోయలో పడ్డారు. నిత్యం స్వామి పూజలో తరించే ఆ పూజారి.. అదే పూజలో ఉండగానే మృతి చెందడంతో భక్తులు విషాదంలో మునిగిపోయారు.