అనకాపల్లిలో విషాదం
` బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం..
` 8మంది మృతి.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు
` సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
` మృతుల కుటుంబాలకు రూ.15లక్షల పరిహారం
అనకాపల్లి(జనంసాక్షి): అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఎక్కువమంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. %మృతుల వివరాలు ఇవీ.. మృతి చెందిన వారిలో 1. అప్పికొండ తాతబాబు (50), 2. సంగరాతి గోవింద్ (45), 3. దాడి రామలక్ష్మి (38), 4. దేవర నిర్మల (36), 5. పురం పాప (40), 6. గుంపిన వేణుబాబు (40), 7. శానవెల్లి బాబురావు(56) 8. చదలవాడ మనోహర్ ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. వీరంతా బాణాసంచా తయారీ కేంద్రంలో కూలి పనికి వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలిని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించారు. క్షతగాత్రుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన.. క్షతగాత్రులను మెరుగైన చికిత్సకోసం కేజీహెచ్‌కు తరలించాలని ఆదేశించారు. కోటవురట్ల మండల కేంద్రానికి మూడు కి.మీల దూరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. తారాజువ్వల తయారీకి పేరొందిన ఈ కర్మాగారంలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. క్షతగాత్రుల్లో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుడు సమయంలో పరిశ్రమలో 15మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది, ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు.
సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎంకు అధికారులు వివరించారు. మరోవైపు, ఈ ఘటనపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నర్సీపట్నం ఆర్డీవోను ఆదేశించారు. నర్సిపట్నం ఏరియా ఆస్పత్రిని ఆయన అప్రమత్తం చేశారు. బెడ్లు, వెంటిలేటర్లు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.కోటవురట్ల ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన హోంమంత్రి అనిత
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని ఆమె అప్రమత్తం చేశారు. బాణసంచా పరిశ్రమ వద్దకు బయల్దేరిన ఆమె.. ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణసంచా పరిశ్రమలోఅగ్నిప్రమాదం ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలన్న ఆయన.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు రూ.15లక్షల పరిహారం
అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో ఎనిమిది మంది మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. కొటవురట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అగ్నిప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరికీ రూ.15లక్షలు చొప్పున ఆయా కుటుంబాలకు పరిహారంగా అందించనున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడిరచారు. అగ్నిప్రమాదం ఘటన గురించి తెలుసుకున్న హోంమంత్రి అనిత హుటాహుటిన అక్కడికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. అనకాపల్లి అగ్నిప్రమాదంపై స్థానికులు, అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా.. ఏడుగురికి గాయాలయ్యాయన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదంపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేశ్ ఆరా తీశారన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని చెప్పారు. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షలు చొప్పున పరిహారం ఇచ్చేదని.. సీఎం చంద్రబాబు మానవతా దృక్పథంతో ఇచ్చిన ఆదేశాలతో రూ.15 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు అనిత వెల్లడిరచారు.