అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

తక్షణం పంట నష్టాన్ని అంచనా వేసి సాయం అందించాలి
కొత్త పంటలు వేసుకునేలా పెట్టుబడులు సమకూర్చాలి

హైదరాబాద్‌,జూలై19(జనంసాక్షి

): జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటల స్థానంలో రైతులు కొత్త పంటలను వేసేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేస్తోంది. పంటలు దెబ్బతిన్న గ్రామాల పరిధిలో రైతులకు అవగాహన కల్పించి మళ్లీ పంటలను వేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
భారీ వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగినా ఇప్పటికీ పరిహారంపై ప్రకటన లేదు.. ఇన్‌పుట్‌ సబ్సిడీపై జీవో లేదు. పాత జీవో సమయం ముగియడంతో ప్రస్తుతం పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందే పరిస్థితి కనిపించడం లేదు. వర్షాలకు దెబ్బ తిన్న పంటల కోసం ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి జీవోను విడుదల చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాత జీవో ప్రకారం వర్షాలకు పంటలు దెబ్బతింటే హెక్టారుకు 13,500 రూపాయలను ప్రభుత్వం అందజేసేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు ఈ నిధులను కేటాయిస్తారు. జిల్లాల వారీగా పంట నష్టం అంచనావేసి రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీనీ జమ చేస్తారు. అయితే జీవో మనుగడలో లేనందున ఈ దఫా వర్షాలకు దెబ్బతిన్న రైతులకు సహాయం అందించడం కష్టమేనని తెలుస్తోంది. ఆయా జిల్లాల్లో పంటల సాగుకోసం లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన కొద్దిరోజులకే వర్షాల వల్ల పంటలు నేలపాలు కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పంటలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం జాతీయ విపత్తు కింద
ఇచ్చిన జీవో గడువు ముగిసి రెండేళ్లు గడిసింది. ఇప్పటి వరకు కొత్త జీవోను విడుదల చేయలేదు. వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయి. వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం వల్ల లక్షల ఎకరాల వరకు పంట దెబ్బతింది. వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల వారీగా దెబ్బతిన్న పంటల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదికను పంపుతున్నారు. ఈ వర్షాలకు వరి బాగా దెబ్బతింది. వరి, నారుమళ్లతో పాటుగా పత్తి, సోయా తదితర పంటలు దెబ్బతిన్నాయి. నాటువేసిన వారం రోజులలోపే భారీ వర్షాలు పడి పంట చేన్లలో నీళ్లు నిల్వడంతో ఈ పంట దెబ్బతింది. మొక్క జొన్న, పత్తి పంటలు వేల ఎకరాల వరకు దెబ్బ తింది. పంటలకు వేలాది రూపాయలు పంటలకు పెట్టుబడి పెట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. భారీగా పంటలు దెబ్బతినడంతో వ్యవ సాయశాఖ అధికారులు రైతులకు తక్కువ రోజులలో పండే పంటలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వాటికి సంబంధించిన విత్తనాలను సూచిస్తూ నేరుగా సాగుచేయాలని కోరుతున్నారు. నారుమళ్లు వేసి నాటు వేయాలని కోరుతున్నారు. ఆగస్టు చివరి వరకు అవకాశం ఉన్నందున సమయం మించిపోలేదని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు సొసైటీల ద్వారా సరఫరా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, ఎంటీయూ విత్తనాలను అందుబాటులో ఉంచారు. రైతులు సమస్యలు ఎదుర్కోకుండా విత్తనాలు వెదజల్లే పద్ధతిలో సాగుచేయాలని కోరుతున్నారు. ఈ విధానంలో వరి వేయడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు దిగుబడి వస్తోందని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలు కాపాడుకునేందుకు ఎరువుల వినియోగం పెంచడంతో 20 వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచారు. సొసైటీలు, డీలర్ల ద్వారా అధికారులు సరఫరా చేస్తున్నారు.ఈ క్రమంలో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలి. పరిహారం అందించి పంటలు వేసుకునేందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందించాలి. ఇప్పటికే నకిలీ విత్తనాలు నట్టేట ముంచగా.. మొలకెత్తిన పంటలను చీడపీడల నుంచి కాపాడుకోగా భారీ వర్షాలు ముంచెత్తాయి. గత వారం రోజులుగా కురిసిన ముసురు అన్నదాతలకు నష్టం తెచ్చి పెట్టింది. ఎడతెరపి లేకుండా ముసురు కమ్మేయడంతో వరితో పాటు ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, సోయా, పెసర, మినుము, కంది లాంటి పంటలు ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న సమయంలో ముసురు పంటతో చేనులోకి వరద భారీగా వచ్చి చేరడంతో పాటు ఆ పంటలు కాస్తా నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలను ఎలా కాపాడుకునేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో చేనుల్లోకి వరద వచ్చి చేరి పంటలు మునుగగా చేను చెరువుల మారిపోతుంది. పలు మండలాల్లో వర్షాలకు సుమారు వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. వరితో పాటు ఆరుతడి పంటలను అన్నదాతలు విస్తారంగా సాగు చేస్తుంటారు. ఓ వైపు భారీ వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఈ ముసురు ఆరుతడి పంటల రైతులకు మాత్రం నష్టం చేకూర్చడంతో ఆందోళన చెందుతున్నారు.